ఆర్టీసీ జేఏసీ నేతల చర్చలు విఫలం.. వాట్ నెక్స్ట్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అన్ని డిమాండ్లు పరిష్కరించాలని కార్మిక నేతలు పట్టుబట్టారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం మాత్రం వారి డిమాండ్స్‌ను అంగీకరించలేదు. నలుగురు ఆర్టీసీ జేఏసీ నేతలకు మాత్రమే చర్చలకు అనుమతిచ్చారు. చర్చల ప్రక్రియను యాజమాన్యం వీడియో చిత్రీకరణ చేసింది. ఈ క్రమంలో జేఏసీ నేతలు ఫోన్‌లు తీసుకుని అధికారులు స్విచాఫ్ చేయించారని వారు చెబుతున్నారు. చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చర్చల్లో ఆర్టీసీ అధికారులు పాల్గొనలేదు..!
‘ప్రభుత్వం కోర్టు తీర్పునకు వక్రభాష్యం చెబుతూ 21 డిమాండ్లపై మాత్రమే చర్చిస్తామంటోంది. మా డిమాండ్లలో కొన్ని మినహాయించాలని కోర్టు చెప్పలేదు. డిమాండ్లపై అసలు చర్చించనే జరగలేదు. మా ఫోన్లు తీసుకోవడానికే వాళ్లకు అరగంట సమయం పట్టింది. చరిత్రలో తొలిసారి అధికారులు చర్చలను బాయ్‌కట్ చేశారు. చర్చల్లో ఆర్టీసీ అధికారులు పాల్గొనలేదు. ఎప్పుడు పిలిచినా చర్చలకు వచ్చేందుకు సిద్ధం
నాపై కేసు సరికాదు.. ఇది పోలీసుల దమనకాండ’ అని అశ్వత్థామరెడ్డి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఈయూ నేత రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 30న సకల జనుల సమర భేరి నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
పరిష్కరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు!
‘శత్రుదేశాలతో కూడా ఇంత నిర్భంధంగా చర్చలు జరిగి ఉండవు. కేవలం కోర్టు చెప్పిందనే చర్చలకు పిలిచారు. ప్రభుత్వానికి సమస్య పరిష్కరించే ఉద్దేశ్యం లేదు. కేవలం నలుగురిని మాత్రమే చర్చలకు పిలవడం సరికాదు. సహచర నేతలను చర్చలకు అహ్వానించలేదు. ఫోన్ ద్వారా చర్చించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు’ అని వాసుదేవరావు చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. ఇవాల్టితో చర్చలు జరిగితే సమస్యలు పరిష్కారం అవుతాయని అందరూ భావించారు.. అయితే ఆ చర్చలు కాస్త ఫెయిల్ అవ్వడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఈ వ్యహారంపై సీఎం కేసీఆర్ ఏం తేలుస్తారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments