నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్‌గా నీలం సాహ్ని
- IndiaGlitz, [Thursday,November 14 2019]
నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. కాగా ఏపీలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎస్‌గా ఎల్వీ సుబ్రమణ్యం వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం.. సాహ్నికి బాధ్యతలు కట్టబెట్టింది. ఇదిలా ఉంటే.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సతీనాయర్, మిన్నీ మాథ్యూ ప్రభుత్వ మహిళా ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఇన్‌చార్జి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ నుంచి సాహ్ని ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సాహ్నీ ట్రాక్ రికార్డ్ ఇదీ...
1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఏపీలో.. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటీ సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా విధులు నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పని చేసిన సాహ్ని.. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశాక.. ఎపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. కాగా సాహ్ని 2020 జూన్ నెలాఖరు వరకు సర్వీస్‌లో ఉండనున్నారు. నవ్యాంధ్ర తొలి మహిళా సీఎస్ నీలం సాహ్ని కావడం విశేషం.