Needi Naadi Oke Katha Review
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనియించినప్పుడు కాదు, ఆ పుత్రుడు ప్రయోజకుడైనప్పుడే అని నమ్మే మధ్య తరగతి తండ్రికి, ఆయన తనయుడికి మధ్య జరిగే కథ ఇది. దర్శకుడు దేవీప్రసాద్ మధ్య తరగతి తండ్రిగా నటించిన సినిమా. `నీదీ నాదీ ఒకే కథ` అని తెరమీద హీరో, తెర ముందు ఉన్న ప్రేక్షకుడితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. మరి కనెక్షన్ కుదురుతుందా? పరిస్థితి ఏంటి? అనేది ఆసక్తికరం.
కథ:
రుద్రరాజు సాగర్ (శ్రీ విష్ణు)కి పొట్ట పొడిచినా అక్షరం ముక్క రాదు. రాసిన పరీక్షలనే మళ్లీ మళ్లీ రాస్తూ ఉంటాడు. చివరికి అతని చెల్లెలితో పాటు కూడా ఓ ఏడాది పరీక్ష రాయాల్సి వస్తుంది. ఎప్పుడూ ఫెయిలయ్యే అతను ఆ ఏడాది అన్ని సబ్జెక్టుల్లోనూ పాస్ అయ్యాడని తెలుస్తుంది. అది పొరపాటున జరిగిందనే విషయం మరలా అర్థమవుతుంది. ఈ క్రమంలో అతని తండ్రి రుద్రరాజు దేవీ ప్రసాద్ (దేవీప్రసాద్ )కి మరింత చిరాకు వస్తుంది. ఇదిలా సాగుతూ ఉండగా సాగర్‌కి ధార్మిక (సాత్నా) పరిచయమవుతుంది. ఆమె అడుగుజాడల్లో నడిచి తండ్రికి ప్రియతముడిగా మారాలనుకుంటాడు సాగర్. అయితే అది తన స్వభావానికి విరుద్ధమని తెలుసుకుంటాడు. తను తనలా ఉండటానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలనూ చేస్తాడు. తండ్రిని ఒప్పించే దిశగా అడుగులు వేస్తాడు. ఆ క్రమంలో అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి? దేవీప్రసాద్ కొడుకును అర్థం చేసుకున్నాడా? లేదా? ధార్మిక చెప్పే సూచనలు ఫలించాయా? లేదా? చివరికి సాగర్ ఎంచుకున్న బాట ఎలాంటిది వంటివన్నీ కీలకాంశాలు.
ప్లస్ పాయింట్లు:
టైటిల్స్ ప్రొజెక్ట్ చేసే సమయం నుంచే ఓ మూడ్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. తండ్రి పాత్రలో దేవీప్రసాద్ సహజంగా నటించారు. ఒక వైపు కన్న కొడుకు మీద గుండెల నిండా ప్రేమ, చుట్టూ సమాజం గురించి ఆలోచన, మరోవైపు అన్నాళ్లూ కష్టపడి సాధించుకున్న పేరుప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందేమోననే బెంగ.. ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రలో దేవీప్రసాద్ చక్కటి నటనను కనబరిచారు. చదువు అబ్బని కుర్రాడిగా, తండ్రి మార్గంలో పయనించి ఆయన్ను మెప్పించాలనుకునే యువకుడిగా, అది సాధ్యం కాని పక్షంలో అయోమయానికి గురయ్యే వాడిగా శ్రీవిష్ణు నటన ఆకట్టుకుంది. శ్రీవిష్ణు చెల్లెలిగా నటించిన అమ్మాయి, తల్లిగా నటించిన ఆవిడ చాలా మంచి మార్కులే వేయించుకున్నారు. తనదైన పెర్ఫార్మెన్స్ తో పోసాని అల్లుకుపోయాడు. పాటలు కూడా అక్కడక్కడా బాగానే ఉన్నాయి. లొకేషన్లు చాలా నేచురల్‌గా అనిపించాయి.
మైనస్ పాయింట్లు:
కథలో కొత్తదనం అసలు లేదు. చదువు అబ్బని కొడుకు, అతన్ని చూసి బాధపడే తండ్రి పాత్రలను ఎన్నో సార్లు తెరమీద చూశాం. ఇందులోనూ అదే కథ పునరావృతమైంది. ఇంటర్వెల్ ఎపిసోడ్‌లోగానీ, క్లైమాక్స్ లో గానీ, ప్రీ క్లైమాక్స్ లోగానీ.. ఎక్కడా కొత్తదనం లేదు. అసలు ట్విస్ట్ లు తెలియని ఫ్లాట్ కథ ఇది. రీరికార్డింగ్ మోత కాస్త ఎక్కువైంది. మూసగా ఒకే రాగాన్ని వినిపించి చిరాకు తెప్పించారు. స్క్రీన్‌ప్లే కూడా నిదానంగా సాగి సహనానికి పరీక్ష పెట్టింది.
విశ్లేషణ:
కొడుకులు ప్రయోజకులు కావాలనుకునే తండ్రులే అందరూ ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే అందరూ కొడుకులు ప్రయోజకులుగా నెంబర్ వన్ ర్యాంకులే తెచ్చుకుంటే మరి నెంబర్ టు, త్రీ .. ర్యాంకులను తెచ్చుకునేవారెవ్వరూ. అంటే తమ బిడ్డలు గొప్ప స్థానంలో ఉండాలనుకోవడంలో తప్పు లేదు... కానీ దాన్ని ఆధారంగా చేసుకుని తమ బిడ్డలు ఎందుకు కొరగాని వారు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరి జీవితం వారిది. కొడుకు బలాదూర్‌గా తిరుగుతుంటే తండ్రి కొడుకుని బాగుపడమని చెప్పడం 7/ జీ బృందావన్ కాలనీ, `ఇడియట్`, `దిల్`, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`.. వంటి చాలా చిత్రాల్లో చూశాం. తండ్రి అంచనాలను అందుకోలేక కొడవుకు అనే క్యారక్టర్ సతమతమవుతుంటాడు. స్థూలంగా `నీదీ నాదీ ఒకే కథ` కూడా అలాంటిదే. అయితే ఈ చిత్రంలో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పుస్తకాల గురించి ప్రస్తావన ఉంది. వాటి వల్ల ఒరిగేది ఏమీ లేదనీ, ఫేక్ ఐడెంటిటీ కోసం వృథా ప్రయాసలు చేస్తున్నారనీ హీరో చెబుతాడు. ఎవరేం చేసినా దాని పరమావధి ఆనందం కావాలని కోరుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి హీరో. చిన్న చిన్న ఆనందాలను కోల్పోయి జీవితంలో ఏదో సాధిద్దామని ఉరుకులు పరుగులు తీసేవారిని జాలిగా చూస్తాడు . దర్శకుడు అతని పాత్రను మలిచిన తీరు బావుంది. చుట్టూ సమాజానికి ప్రతినిధులుగా పాన్ వ్యాపారం చేసే వ్యక్తి, కొబ్బరి బొండాం అమ్మే వ్యక్తి, టీ షాపతను, డ్రైవర్.. లను చూపించడం కూడా బావుంది. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం అక్కడక్కడా ఆకట్టుకుంది. అలాగే.. డొగ్ మే 95 టెక్నీక్ కూడా కొన్ని సన్నివేశాల్లో బావుంది.
బాటమ్ లైన్: నీదీ నాదీ... మనందరి కథ!
Needi Naadi Oke Katha Movie Review in English
- Read in English