Tamilisai Soundararajan:ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం : బిల్లుపై ప్రతిష్టంభన.. ఈ అంశాలపై వివరణ ఇవ్వాలన్న తమిళిసై
- IndiaGlitz, [Saturday,August 05 2023]
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న వివాదం.. నేటికీ కొనసాగుతోంది. తాజాగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ తమిళిసై మోకాలడ్డుతున్నారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు తనకు కొంత సమయం కావాలని ఆమె స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. దీనికి ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా గవర్నర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.
ఈ ఐదు అంశాలపై వివరణ కావాలన్న తమిళిసై :
అయినప్పటికీ తమిళిసై మాత్రం తగ్గడం లేదు. ఈ బిల్లులో తనకు ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరుతున్నారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడతారు.? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా ..? పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు..? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు..? అని తమిళిసై ప్రశ్నించారు. వీటిపై తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం వుంటుందని తెలంగాణ రాజ్‌భవన్ స్పష్టం చేసింది.
ఆర్టీసీ యూనియన్‌ను చర్చలకు పిలిచిన తమిళిసై :
ఇదిలావుండగా గవర్నర్ కోరిన అంశాలపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అలాగే ఆర్టీసీ యూనియన్ నాయకులను కూడా గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాయకులతో చర్చిస్తానని తమిళిసై చెప్పారు.