సీక్వెల్ చేయ‌నున్న న‌య‌న‌తార‌?

  • IndiaGlitz, [Thursday,April 05 2018]

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన త‌మిళ సినిమా ‘ఆరమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో అనువదించారు. సామాజిక అంశం నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార కర్తవ్యమే తన విధిగా, ప్రజల క్షేమమే తన ధ్యేయంగా పనిచేసే కలెక్టర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో.. పసిపిల్లలు బోరుబావిలో పడిపోతే వారి కోసం నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాధికారులు తమ విధిని ఎలా నిర్వర్తిస్తారో దర్శకుడు గోపి నైనర్ కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఈ చిత్రం అటు తమిళంతో పాటు.. ఇటు తెలుగులో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్టు సమాచారం. మరో ఊరు, మరో సమస్య అన్నట్టుగా కథను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సీక్వెల్‌లో కూడా నయనతార కలెక్టర్ పాత్రనే పోషించనుండగా.. నేడు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తున్న కుల వ్యవస్థపై ఈసారి దర్శకుడు దృష్టి సారిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ సీక్వెల్ కూడా అనువాద రూపంలో తెలుగు నాట సంద‌డి చేయ‌నుంది.