అనుష్కలాగే నయన కూడా..

  • IndiaGlitz, [Thursday,March 15 2018]

టాలీవుడ్‌లో అనుష్క హీరోయిన్ ఓరియెంటెండ్ మూవీస్‌తో దూసుకుపోతుంటే.. కోలీవుడ్‌లో న‌య‌న‌తార ఈ త‌ర‌హా చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటున్నారు. అలాగే అనుష్క హిట్ చిత్రాలు త‌మిళంలోకి డ‌బ్ అయిన‌ట్టే.. న‌య‌న‌తార హిట్ చిత్రాలు తెలుగులోకి అనువాద‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవ‌లే 'భాగ‌మ‌తి' చిత్రంతో అనుష్క బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా వసూళ్ళ ప‌రంగా మెప్పించింది. పొలిటిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో చంచ‌ల అనే క‌లెక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించారు అనుష్క‌.

క‌ట్ చేస్తే.. అనుష్క లాగే న‌య‌న‌తార కూడా క‌లెక్ట‌ర్‌గా సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్న 'క‌ర్త‌వ్యం' అనే త‌మిళ అనువాద చిత్రంలో న‌య‌న‌తార క‌లెక్ట‌ర్ మ‌ధువ‌ర్షిణిగా క‌నిపించ‌నున్నారు. మ‌రి అనుష్క లాగే న‌య‌న‌తార కూడా క‌లెక్ట‌ర్ పాత్ర‌తో విజ‌యాన్ని సొంతం చేసుకుంటారో లేదో చూడాలి. త‌మిళ‌నాట 'అర‌మ్' పేరుతో విడుద‌లైన 'క‌ర్త‌వ్యం' విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు విజ‌యాన్ని కూడా సొంతం చేసుకుంది.