సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నయనతార!

  • IndiaGlitz, [Thursday,March 25 2021]

మరో స్టార్ హీరోయిన్ పెళ్లికి సిద్ధమవుతోంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి చేసుకుని ఓ ఇంటిదైన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార సైతం పెళ్లికి సిద్ధమవుతోంది. కొంతకాలంగా స్టార్‌ జంట నయనతార, విఘ్నేశ్‌ శివన్ ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నిశ్చితార్థం కూడా చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నయన్‌ ప్రియుడు విఘ్నేష్ శివన్ షేర్‌ చేసిన ఫొటో ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. విఘ్నేశ్‌ శివన్‌ గురువారం ఉదయం ఓ ఆసక్తికర ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు.

అందులో నయనతార చేయి అతడి గుండెల మీద ఉండగా ఆమె వేలికి ఉంగరం తొడిగి ఉంది. ఇది చూసిన అభిమానులు బాగా ఖుషీ అవుతున్నారు. ఈ ప్రేమ జంట సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ కానిచ్చేసిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2015లో 'నానుమ్ రౌడీదాన్' సినిమా స‌మ‌యంలో న‌య‌న్‌, విఘ్నేష్‌లు ప్రేమ‌లో ప‌డ్డారు. కొంతకాలం పాటు వీరి ప్రేమ విషయాన్ని బయటకు తెలియనివ్వలేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ జోరుగా ప్రచారం నడిచినప్పటికీ ఈ జంట మాత్రం స్పందించలేదు.

ఆ తరువాత సోషల్ మీడియాలో ఈ జంట ఓపెన్ అయిపోయింది. అప్పటి నుంచి ఈ జంట ఎక్కడికెళ్లినా తాము తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ జంట ఇప్పటివ‌ర‌కు ఎన్నో విహార‌యాత్రలు చేసింది. దీనిలో భాగంగానే విదేశీ పర్యటనలు సైతం భారీగానే చేసింది. పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిసి సెలబ్రేట్‌ చేసుకుంటూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వీళ్లిద్దరూ మొత్తానికి ఒకింటివారవుతుండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అయితే నిజంగానే నయన్, విఘ్నేష్‌ల జంట వివాహం ద్వారా ఒక్కటవుతోందా? లేదా? అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తేనే తెలిసే అవకాశం ఉంది.