విఘ్నేశ్‌తో విడిపోయారన్న వార్తలపై నయన్ క్లారిటీ

  • IndiaGlitz, [Monday,January 06 2020]

లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి నటన పరంగా ప్రత్యేకించి మరి చెప్పనక్కర్లేదు. ‘నాకు నేనే పోటీ.. నాకు నేనే సాటి’ అన్నట్టుగా నటించేస్తుంటుంది. అయితే రీల్ లైఫ్ వరకూ అంతా ఓకే గానీ.. రియల్ లైఫ్‌లో మాత్రం ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదు. ఇప్పటికే పలువురితో ప్రేమలో మునిగి తేలిన ఈ సీనియర్ నటి.. ఏం జరిగిందో ఏమోగానీ.. చివరికి డైరెక్టర్ విఘ్నేశ్ వద్ద వచ్చి ఆగింది. మిగిలిన వారితో ఉన్న బాండింగ్‌తో పోలిస్తే.. వీరిద్దరు మాత్రం చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. వీరి ప్రేమ పెళ్లి పీటలదాకా ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని నయన్ అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. క్రిస్మస్ పెళ్లి బాజాలు మోగుతాయని వార్తలు వచ్చినప్పటికీ జరగలేదు.

అబ్బే అదేం లేదే!

అయితే.. గత రెండ్రోజులుగా.. నయన్-విఘ్నేశ్ ఇద్దరూ విడిపోయారన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. ఇక చేసేదేమీ ఎవరికివారుగా విడిపోయారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వచ్చిన కొన్ని గంటలకే నయన్ రియాక్ట్ అయ్యింది. అవార్డ్ ఫంక్షన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ‘నాకు అవార్డులు దక్కడానికి కారణమైన అభిమానులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడంలో విఘ్నేశ్ శివన్ సహకారం ఎంతో ఉంది. విఘ్నేశ్ శివన్ ప్రేమలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ప్రేమలో నేను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను’ అని క్లారిటీ ఇచ్చుకుంది. మొత్తానికి చూస్తే పుకార్లకు నయన్ ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న మాట.