Download App

Nawab Review

మ‌ణిర‌త్నం పాన్ ఇండియా లెజెండ్‌. ఆయ‌న భాష‌ల‌కు అతీతంగా ఎప్పుడో ఎదిగారు. మణిర‌త్నం సినిమా వ‌స్తుందంటే కేవ‌లం త‌మిళ ప్రేక్ష‌కులే కాదు, తెలుగు, హిందీ ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తుంటారు. అలాంటి క్రేజ్‌ను సంపాదించుకున్నారు మ‌ణి. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన `న‌వాబ్‌` ఆ క్రేజ్‌ను రెట్టింపు చేసింది. అందుకు కార‌ణం ఆ సినిమా మ‌ల్టీస్టార‌ర్ కావ‌డ‌మే. రోజాతో ఆక‌ట్టుకున్న మ‌ణిర‌త్నం, అరుణ్‌విజ‌య్‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాష్‌రాజ్‌, జ్యోతిక‌.. న‌టీన‌టుల లిస్టు చూస్తే సినిమా మీద అంచ‌నాలు పెరుగుతున్నాయి. మ‌రి ఈ సినిమా ఆ ఎక్స్ పెక్టేష‌న్స్ ని రీచ్ అయ్యేలా ఉందా..? ఒక‌సారి చూడండి..

కథ:

చిన్న గ్యాంగ్‌స్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయాలను శాసించే స్థితికి ఎదుగుతాడు భూపతిరెడ్డి(ప్రకాశ్‌ రాజ్‌). ఓసారి ఇద్దరు వ్యక్తులు భూపతి, అతనిభార్య ప్రయాణిస్తున్న కారుపై దాడి చేస్తారు. దీంట్లో భూపతి ప్రాణాలతో బయటపడినా.. ఆయన తర్వాత స్థానం ఎవరనే దానిపై ముగ్గురు కొడుకులు వరద(అరవిందస్వామి), త్యాగు(అరుణ్‌ విజయ్‌), రుద్ర(శింబు) పోటీ పడతారు. ఈ పోటీలో ముగ్గురు తమ భార్యలను పోగొట్టుకున్నా కూడా లెక్క చేయకుండా పవర్‌కోసం ఒకరినొకరు చంపుకోవాలనుకుంటారు. వరదకు అతని స్నేహితుడు, సస్పెండ్‌ అయిన పోలీస్‌ ఆఫీసర్‌ రసూల్‌(విజయ్‌ సేతుపతి) అండగా ఉంటాడు. అతన్ని తమ రూట్‌లోకి తెచ్చుకుని వరదను చంపడానికి త్యాగు, రుద్ర ఏకమవుతారు. చివరకు ఈ ముగ్గురిలో ఎవరు విజయం సాధించి పవర్‌ను దక్కించుకుంటారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

ప్లస్‌ పాయింట్స్‌:

- నటీనటులు
- కెమెరా పనితనం
- ఎడిటింగ్‌

మైనస్‌ పాయింట్స్‌:

- కథలో కొత్తదనం లేకపోవడం
- కనెక్టింగ్‌ ఎమోషనల్‌ పాయింట్‌ లేకపోవడం

సమీక్ష:

భూపతి రెడ్డి పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌, అతని భార్యగా జయసుధ ఒదిగిపోయారు. వరద, త్యాగు, రుద్ర పాత్రల్లో అరవింద స్వామి, అరుణ్‌ విజయ్‌, శింబు... అరవింద స్వామి భార్య చిత్ర పాత్రలో జ్యోతిక, త్యాగు భార్య పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌, రుద్ర గర్ల్‌ ఫ్రెండ్‌గా డయానా ఎర్రప్ప.. సస్పెండెడ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌ రాజ్‌ వ్యతిరేకిగా త్యాగరాజన్‌, మన్సూర్‌ ఆలీఖాన్‌ .. ఇలా వీరి నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వారి వారి పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఇక మణిరత్నం ఓ మాఫియా లీడర్‌ స్టోరి అంటే పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య గన్‌ వార్‌ అన్నట్లు కాకుండా పవర్‌ కోసం పడే పోటీని.. దాని వల్ల వచ్చే ఇబ్బందులను ఎమోషనల్‌ యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేయాలనుకున్నారు. అయితే గ్యాంగ్‌వార్‌ కాన్సెప్ట్‌ అనేది ఎమోషన్స్‌ను డామినేట్‌ చేసేయడంతో సన్నివేశాల్లో ఎమోషన్స్‌ ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్‌ కావు. నాయకుడు వంటి మాఫియా స్టోరిని కూడా హృదయాన్ని టచ్‌ చేసేంత ఎమోషన్స్‌తో తెరకెక్కించిన మణిరత్నం ఈ సినిమాను ఆ రేంజ్‌లో తెరకెక్కించలేకపోయాడు. అయితే కథలోకిన ట్విస్టులను ఒకదాని కొకటి లింక్‌ పెడుతూ తెరకెక్కించిన తీరు ఆసక్తి కరంగా సాగుతుంది. అసలు ప్రకాశ్‌ రాజ్‌పై దాడి చేసింది ఎవరు? అసలు ముగ్గురు కొడుకుల మధ్య పోటీ ఎందుకు ? చివరకు గొడవలు వల్ల ఎవరు ఏం సాధించారు? అనే విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఎ.ఆర్‌.రెహమాన్‌ ట్యూన్స్‌ ఆకట్టుకోవు.. అయితే నేపథ్య సంగీతం బావుంది. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. శ్రీకర్‌ ప్రసాద్‌ కూర్పు బాగానే ఉంది.

బోటమ్‌ లైన్‌:

మాఫియా, డ్రగ్స్‌, గొడవలు అనేవి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవు. మణిరత్నం సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు సినిమాను బాగా ఎంజాయ్‌చేస్తారనడంలో సందేహం లేదు.

Read 'Nawab' Movie Review in English

Rating : 3.0 / 5.0