కేసులో ఊరట .. శ్రీవారిని దర్శించుకున్న నవనీత్ కౌర్
- IndiaGlitz, [Friday,June 25 2021]
ప్రముఖ నటి, ఎంపీ నవనీత్ కౌర్ తిరుమలలో శ్రీవారికి దర్శించుకున్నారు. ఇటీవల కొంతకాలంగా నవనీత్ కౌర్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మహారాష్ట్రలోని అమరావతి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నవనీత్ కౌర్ ఇండిపెండెట్ అభ్యర్థిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: బిగ్ సర్ ప్రైజ్.. మరో తెలుగు డైరెక్టర్ తో ధనుష్ పాన్ ఇండియా మూవీ
అయితే నవనీత్ కౌర్ ఎన్నికని సవాల్ చేస్తూ, ఆమె నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించిందనే ఆరోపణలతో శివసేన నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్ ని రద్దు చేసిన బాంబే హైకోర్టు 2 లక్షల జరిమానా కూడా విధించింది.
దీనిని సవాల్ చేస్తూ ఆమె సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే సుప్రీంలో ఆమెకు ఊరట లభించింది. బాంబే కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నవనీత్ కౌర్ తన పదవి కూడా కోల్పోయే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆమె సుప్రీంని ఆశ్రయించి ఉపశమనం పొందారు.
దీనితో నవనీత్ కౌర్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తనకు పేరు ప్రఖ్యాతలు రావడానికి కారణం తెలుగు ప్రజలే అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రైతులు, మహిళలు, యువతకు తాను సేవ చేయాలనుకుంటున్నట్లు నవనీత్ తెలిపారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ప్రజలు సంతోషంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.