నవరస నట తిలకం మంచు మోహన్ బాబు 40 ఏళ్ల సుదీర్ఘ నటప్రస్ధానంకు ఘన సన్మానం

  • IndiaGlitz, [Sunday,September 18 2016]

ప్ర‌తి నాయ‌కుడుగా, క‌దానాయ‌కుడుగా, నిర్మాత‌గా, విద్యావేత్త‌గా, రాజ‌కీయ నాయ‌కుడుగా...ఇలా త‌ను ప్ర‌వేశించిన ప్ర‌తి శాఖ‌లో విశేష గుర్తింపు ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్ బాబు. 500 పైగా చిత్రాల్లో న‌టించిన మోహ‌న్ బాబు న‌టుడుగా 40 వ‌సంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌ళాబంధు టి.సుబ్బ‌రామిరెడ్డి మోహ‌న్ బాబును స‌త్క‌రించి న‌వ‌ర‌స న‌ట తిల‌కం అనే బిరుదు ప్ర‌దానం చేసారు. వైజాగ్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్, మంచు విష్ణు, మ‌నోజ్, మంచు ల‌క్ష్మి ప్ర‌స‌న్న‌, ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు, రాఘ‌వేంద్ర‌రావు, బోనిక‌పూర్, శ్రీదేవి, జ‌య‌సుధ‌, నితిన్ క‌పూర్, జ‌య‌ప్ర‌ద‌, నాగ‌బాబు,బ్ర‌హ్మానందం, సునీల్, ఆలీ త‌దిత‌రులు పాల్గొన్నారు

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి మాట్లాడుతూ... 40 వ‌సంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మోహ‌న్ బాబుకి న‌వ‌ర‌స న‌ట తిల‌కం అనే బిరుదు ప్ర‌దానం చేస్తుండ‌డం ఆనందంగా ఉంది. మోహ‌న్ బాబు గారికి ఎవ‌రు రాసారో తెలియ‌దు కానీ...నా రూటే స‌ప‌రేటు అనే డైలాగ్ క‌రెక్ట్ గా స‌రిపోతుంది. నిజంగానే ఆయ‌న రూటే వేరు. అంత తొంద‌ర‌గా ఆయ‌న్ని ఎవ‌రూ అర్ధం చేసుకోలేరు. కృషి, ప‌ట్టుద‌ల‌,క్ర‌మ‌శిక్ష‌ణ‌, శ్ర‌మ...ఇవే ఆయ‌న బ‌లాలు. మా గురువు గారి ఆశీర్వ‌చ‌న బ‌లం ఎప్పుడూ ఉంది...ఎప్ప‌టికీ ఉంటుంది కానీ..మోహ‌న్ బాబు ఈ స్థితికి వ‌చ్చాడంటే నిరంత‌ర కృషి, క‌ఠోర శ్ర‌మ క్ర‌మ‌శిక్ష‌ణ ఈ మూడు ముఖ్య కార‌ణాలు అని నేను అనుకుంటున్నాను. స్వ‌ర్గం న‌ర‌కం చిత్రం న‌ల‌భై ఏళ్ల‌కు పునాది. ఈ పునాదిలో నాది ఇసుకో సిమెంటో కానీ నాపాత్ర కూడా ఉన్నందుకు గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. అలాగే ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఎ చిత్రంలో న‌ట విశ్వ‌రూపం చూపించారు. అలాగే పెద‌రాయుడు చిత్రం మోహ‌న్ బాబుకి అఖండ కీర్తిని తెచ్చిపెట్టింది. ఆయ‌న కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన పెద‌రాయుడు చిత్రానికి నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం నా జ‌న్మ‌ధ‌న్యం అయిన‌ట్టుగానే ఫీల‌వుతున్నాను. ఆయ‌న ఇంకా ఎన్నో విజ‌యాలు సాధిస్తూ ఆనందాల‌ను అంద‌రితో పంచుకుంటూ ముందుకు సాగిపోవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

మంచు ల‌క్ష్మిప్ర‌స‌న్న మాట్లాడుతూ... ఈరోజు మా నాన్న‌గారికి ఘ‌నంగా స‌త్కారం జ‌రిగింది. న‌వ‌ర‌స న‌ట తిల‌కం అనే బిరుదు ప్ర‌దానం చేసారు. అయితే...ఇంత‌కంటే గొప్ప బిరుదు నాకు ఉంది. అలాగే ఇంత‌కంటే గొప్ప స‌న్మానం నాకు జ‌రిగింది. ఆ బిరుదు మోహ‌న్ బాబు గారి అమ్మాయి ఇంత‌కంటే గొప్ప నాకు ఎవ‌రూ ఇవ్వ‌లేరు. మెహ‌న్ బాబు గారి అమ్మాయి అనే మాట భ‌గ‌వంతుడు నాకు ఇచ్చిన అభినంద‌న‌. ఎన్నో జ‌న్మ‌ల నుంచి నేను చేసిన పుణ్యాలు అన్నింటిని క‌లిపి ఒకేసారి దేవుడు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్. మా నాన్న గారు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ అయితే నేను క‌ళామ‌త‌ల్లి మ‌న‌వ‌రాలుని అని ఫీల‌వుతుంటాను. ఇంత గొప్ప జ‌న్మ ఇవ్వ‌ట‌మే భ‌గ‌వంతుడు నాకు చేసిన స‌న్మానం.

మా నాన్న గారి గురించి చెప్పాలంటే...50 ఏళ్లు దాటిన జీవితం గురించి 40 ఏళ్లు దాటిన న‌ట జీవితం గురించి 500 పైగా సినిమాలు గురించి చెప్పాలి దానికి నేను స‌రిపోను. క‌రెక్ట్ గా చెప్పాలంటే నాన్న గారిలోని న‌టుడు గురించి నిర్మాత గురించి ప్రేక్ష‌కుల‌కే బాగా తెలుసు. ప‌ద్మ‌శ్రీ మోహ‌న్ బాబు గారు తెలుగు ప్రేక్ష‌కులకు సొంతం. కానీ ఆయ‌న‌లోని నాన్న నాకే సొంతం. నాన్న అనే రెండు అక్ష‌రాల ప్రేమ గురించి చెప్పే ప్ర‌య‌త్నం చేస్తాను.ఇది పూర్తి కానీ ప్ర‌య‌త్నం. ఎంత చెప్పినా ఇంకా ఇంకా మిగిలి ఉండే ప్ర‌య‌త్నం. త‌ల్లిదండ్రులు అంద‌రూ పిల్ల‌ల‌కు క‌ష్టం లేకుండా పెంచాలి అనుకుంటారు. మా నాన్న గారు మ‌మ్మ‌ల్ని క‌ష్ట‌పెట్ట‌కుండా పెంచారు. కానీ క‌ష్టం తెలియ‌కుండా పెంచ‌లేదు. ఎందుకంటే ఎన్ని అంత‌స్ధుల భ‌వ‌నం అయినా నిల‌బ‌డ‌టానికి క‌ష్టం అనే పునాది అవ‌స‌రం ఇది నాన్న‌కు బాగా తెలుసు. ఇప్పుడు మాకు ఏం కావాల‌న్నా క్ష‌ణాల్లో వ‌చ్చేస్తాయి. కానీ ఒక‌ప్పుడు మా నాన్న‌గారికి ఇవేమీ లేవు. ఆయ‌న ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ఇంత సుఖ‌మంత‌మైన జీవితం మీకు ఇస్తుంది ఇప్ప‌టి డ‌బ్బు కాదు ఒక‌ప్ప‌టి నా పేద‌రికం అని. సంఘంలో మీకు ఇంత గుర్తింపు గౌర‌వం ఇస్తుంది ఇప్ప‌టి కీర్తి ప్ర‌తిష్ట‌లు కాదు.ఒక‌ప్ప‌టి నా క‌ష్టం అని. ఇలా క‌ష్టం విలువ తెలిసిన నాన్నకు పిల్ల‌లుగా పుట్ట‌డం గ‌ర్వంగా చెప్పుకుంటాం. మాకు ఊహ తెలిసిన త‌ర్వాత ఎన్నో స‌క్సెస్ లు చూసాం. ఎన్నో ఫెయిల్యూర్స్ చూసాం కానీ..ఆయ‌న పొంగిపోవ‌డం కానీ కుంగిపోవ‌డం కానీ చూడ‌లేదు. మా నాన్న గారి ప్ర‌య‌త్నాలు ఫెయిల్ అయి ఉండ‌చ్చేమో కానీ...ప్ర‌య‌త్నించ‌డంలో మాత్రం నాన్న గారు ఎప్పుడూ ఫెయిల్ అవ్వ‌లేదు. మాకు ఆయ‌న ప్రేమ తెలుసు కోపం తెలుసు బాధ తెలుసు. కానీ మా నాన్న గారిలో భ‌యం ఎప్పుడూ చూడ‌లేదు. చాలా మందికి చూడ‌డానికి మా నాన్న క‌ఠినంగా క‌నిపిస్తారు. శిలా శిల్పం రెండూ క‌ఠినంగానే ఉంటాయి. మా నాన్న శిల్పం శిల కాదు. అది ద‌గ్గ‌ర‌గా చూసిన వాళ్ల‌కే తెలుస్తుంది. అంత గొప్ప మ‌నిషికి కూతురుగా పుట్టే అదృష్టం నాకు ఇచ్చిన దేవుడికి, నాన్న‌ను త‌లుచుకున్న‌ప్పుడు నాకు వ‌చ్చే ధైర్యానికి, మోహ‌న్ బాబు గారి అమ్మాయిని అయినందుకు నాకు క‌లిగే గ‌ర్వానికి ఆ ఆనందం నాకిచ్చే క‌న్నీళ్లుకు నేను ఎప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. ఆ రుణం తీర‌దు నేను చేయ‌గ‌లిగిందల్లా ఒక్క‌టే. నాన్న గారి పేరు నిల‌బెట్ట‌డం అన్నారు.

ర‌జ‌నీకాంత్ నాన్న గారు గురించి ఓ లేఖ పంపించారు. ఆ లేఖ ఇప్పుడు చ‌దువుతున్నాను...
పెద‌రాయుడు సినిమా ప్రారంభోత్స‌వం రోజున అప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు గారు క్లాప్ కొట్టి శ్రీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు స్విఛ్చాన్ చేసారు. మొద‌టి స‌న్నివేశాన్ని మోహ‌న్ బాబు గారి పై తీయాల్సి ఉంది. అదే ప‌ద్ద‌తి..! అంద‌రూ ఎదురు చూసింది కూడా అదే. కానీ అక్క‌డికి విచ్చేసిన ప్ర‌ముఖులు, నేను ఎంత చెప్పినా విన‌కుండా ర‌జ‌నీకాంత్ నా ఆప్త‌మిత్రుడు అత‌నిపైనే మొద‌టి షాట్ తీయాల‌ని మోహ‌న్ బాబు ప‌ట్టుబ‌ట్టి శ్రీ ఎన్టీఆర్ గారు క్లాప్, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు స్విచ్ఛాన్ తో నాపై తీసిన మొట్ట‌మొద‌టి సీన్ చిత్రీక‌రించిన క్ష‌ణాల‌ను జీవితంలో ఎన్న‌టికీ మ‌రువ‌లేను. అంతే కాకుండా ఆ చిత్ర నిర్మాణం పూర్తి అయ్యేంత వ‌ర‌కు నాపై మోహ‌న్ బాబు చూపించిన ప్రేమాభిమానాలు లెక్క‌లేన‌ట్టివి. పెద‌రాయుడు సినిమాలో న‌న్ను బాగా న‌టింప‌చేసిన ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి గార్కి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. పెద‌రాయుడు సినిమాలో నాకు ల‌భించిన పాత్ర న‌టుడికి జీవితంలో ఎప్పుడో ఒక‌సారే దొరుకుతుంది. ఆ అవ‌కాశం నా మిత్రుడు చిత్రంలో ల‌భించ‌డం నా అదృష్టం. ఈ చిత్రం తీసిన మోహ‌న్ బాబుకి దేవుడి ద‌య వ‌ల‌న పేరు ప్ర‌ఖ్యాత‌ల‌తో పాటు క‌న‌క‌వ‌ర్షం కురిసింది. అయితే..నాకు చిల్లిగ‌వ్వ కూడా ఇవ్వ‌కుండా రాజుల నాటి క‌డియం తొడిగి న‌న్ను తిరుప‌తి నుంచి మ‌ద్రాసుకు పంపించేసారు. డైలాగులు చెప్ప‌డంలో ఎన్టీఆర్ త‌ర్వాత నా మిత్రుడు మోహ‌న్ బాబు ఒక్క‌రే. మోహ‌న్ బాబు నాకంటే చాలా చాలా గొప్ప న‌టుడు. మ‌ళ్లీ చెబుతున్నా మోహ‌న్ బాబు నాకంటే చాలా చాలా గొప్ప నటుడు అని చెప్ప‌మన్నాడు. నేను ఎప్పుడూ నిజ‌మే మాట్లాడ‌తాను. నా మిత్రుడు ఎక్క‌డ ఉన్నా సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నాను. వ‌ర్ధిల్లాలి నా మిత్రుడు.. పెద‌రాయుడు మోహ‌న్ బాబు వ‌ర్ధిల్లాలి అంటూ ర‌జ‌నీకాంత్ త‌న మ‌న‌సులో మాట‌ల‌ను లేఖ ద్వారా పంపించారు.

ఇక ఇప్పుడు వెంక‌య్య నాయుడు గారు పంపించిన లేఖ చ‌దువుతాను..!
మోహ‌న‌మైన ముఖం మోహ‌న్ బాబుకి సొంతం. ఈరోజు మోహ‌న్ బాబు స‌న్మాన స‌భ జ‌రుగుతుంది అని తెలిసి సంతోషిస్తున్నాను. శ్రీ మోహ‌న్ బాబు విల‌క్ష‌ణ న‌టుడు. తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ఒక ప్ర‌త్యేక స్ధానం సంపాదించుకున్నాడు. నిర్మాత‌గా, న‌టుడుగా, క‌థానాయ‌కుడుగా, ప్ర‌తి క‌థానాయ‌కుడుగా ప్ర‌జ‌ల‌ను మెప్పించారు. చ‌క్క‌ని విద్యాసంస్థ‌ల‌ను స్ధాపించి ఉన్న‌త ప్ర‌మాణాల‌తో న‌డిపిస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుడుగా రాణించ‌క‌పోయినా రాజ‌కీయ మాల్యం అంటించుకోలేదు. త‌ను న‌టించిన పెద‌రాయుడు సినిమా ఎంతో సంతోష‌ప‌రిచింది. ఆ సినిమా శ్రీ మోహ‌న్ బాబులోని విల‌క్ష‌ణ న‌టుడ్ని వెలుగులోకి తెచ్చింది. అన్నింటికి మించి మోహ‌న్ బాబు ఆర‌డుగుల అంద‌గాడు. క్ర‌మ‌శిక్ష‌ణ పాటించే వ్య‌క్తి. ముక్కుసూటిగా మాట్లాడ‌తాడు. నిజాయితీ ఉన్న వాళ్ల‌కే ఆవేశం. అది లేని వాళ్లు ఆవేవాన్ని ప్ర‌ద‌ర్శించినా డైలాగుల‌కు న‌ట‌న‌కే ప‌రిమితం. మోహ‌న్ బాబు గారికి నా శుభాకాంక్ష‌లు అని త‌న సందేశాన్ని పంపించారు.

విక్ట‌రీ వెంక‌టేష్ మాట్లాడుతూ... మోహ‌న్ బాబు గార్కి జ‌రుగుతున్న ఈ ఫంక్ష‌న్ ఒక అద్భుత‌మైన వేడుక‌. ఈ వేడుక‌లో నేను పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న సుబ్బిరామిరెడ్డి గార్కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను.40 ఏళ్ల‌ల్లో చాలా మంది చాలా సంపాదిస్తారు. మోహ‌న్ బాబు గారు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ నుంచి చాలా ప్రేమ‌ను పొందారు. ఇంత ప్రేమ సంపాదించారు అంటే అది ఆయ‌న సిన్సియారిటి వ‌ల‌నే సాధ్య‌మైంది. భ‌గ‌వంతుడి ఆశీస్సుల‌తో ఆయ‌న ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... క‌ళ‌లోనే నేను ఈశ్వ‌ర శ‌క్తిని చూస్తాను. నేను ఎందుకు క‌ళాకారుల‌ను స‌త్క‌రిస్తాను అంటే దానికి కార‌ణం ఆ స‌త్కారాల్లో ఈశ్వ‌ర‌శ‌క్తిని చూస్తాను. ఇంత‌కు పూర్వం శివాజీ గ‌ణేష‌న్, ఆశా భోంస్లే, ఏసుదాసు, జ‌య‌ప్ర‌ద ఇలా ఎంతో మందికి స‌త్కారం చేసాను. ఈరోజు నా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నా విశాఖ ప్ర‌జ‌ల‌కు ఎంతో ఆనందంగా క‌లిగించాల‌నే భావంతో నేను మోహ‌న్ బాబు ఆలోచించి ఈ వేడుక‌ను ఇక్క‌డ ప్లాన్ చేసాం. నిన్న‌టి వ‌ర‌కు వ‌ర్షం ప‌డుతూనే ఉంది. నేను ఈశ్వ‌రుడిని వ‌ర్షం రానీయ‌ద్దు అని ప్రార్ధించాను. కోరిక మ‌న్నించారు. ఈరోజు ఆశ్చ‌ర్య‌క‌రం వ‌ర్షం రాలేదు. ఇదంతా ఆ దేవుడి శ‌క్తి..! ప్ర‌తి ఒక్క‌రూ జీవితంలో ఎంతో సాధిస్తారు. కానీ కొంత మంది సాధించిన దాన్ని అంద‌రూ మెచ్చుకోవ‌డం చాలా అరుదు. మోహ‌న్ బాబు గురించి అంద‌రూ ఉప‌న్యాసం చెప్ప‌డం లేదు. గుండెల్లోంచి వ‌చ్చిన మాట‌లే చెబుతున్నారు. విశాఖ ప్ర‌జ‌లే నా కుటుంబ స‌భ్య‌లుగా భావిస్తాను. అందుచేత‌నే నా పుట్టిన‌రోజును విశాఖ ప్ర‌జ‌ల‌తోనే గ‌డుపుతాను ఆయిశ్వ‌ర్యం, అందం, అధికారం ఇవేవి శాశ్వ‌తం కావు. ఈశ్వ‌ర త‌ప‌స్సు తోటి మ‌నిషి ప్రేమే శాశ్వ‌తం అని నేను న‌మ్ముతాను అన్నారు.

జ‌య‌ప్ర‌ద మాట్లాడుతూ... సుబ్బిరామిరెడ్డిగారు ఎన్నో పుట్టిన‌రోజులు జరుపుకోవాల‌ని, ఆయ‌న స‌మాజానికి ఇంకా సేవ చేయాలని కోరుకుంటున్నాను. ఆయ‌న ఎప్పుడు స్టేజ్ పై ఉన్నా దైవిక‌మైన అనుభూతి క‌లుగుతుంది. ఆయ‌న శివుడు గురించి చెబుతుంటే ఈశ్వ‌రుడు మ‌న ముందు ఉన్నాడ‌నిపిస్తుంటుంది. మోహ‌న్ బాబు గారు న‌టుడుగా 40 ఏళ్లు పూర్తి చేసుకోవం అనేది ఆనందించ‌ద‌గ్గ విష‌యం. త‌ల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారో నాకు తెలుసు.త‌ల్లిదండ్రులు త‌ర్వాత మోహ‌న్ బాబు విజ‌యాన్ని చూసి గురువు దాస‌రి గారు ఎంతో ఆనందిస్తారు. త‌న శిష్యుడికి ఇంత బాగా స‌న్మానం జ‌రుగుతుంటే ఆయ‌న ఎంత ఆనంద‌ప‌డుతున్నారో నాకు తెలుసు. మోహ‌న్ బాబు గారికే కాదు మా అంద‌రికీ గురువు దాస‌రి గారు. ఆయ‌నంటే మా అంద‌రికీ ఎంతో ఇష్టం. ఎంతో ప్రేమ‌..! ఆయ‌న నేర్పించిన పాఠాల వ‌ల‌నే మేము విజ‌యం సాధించాం. మోహ‌న్ బాబు క‌ళారంగంలోనే కాకుండా విద్యారంగంలో కూడా రాణించారు. అలాగే రాజ‌కీయాల్లో ప్ర‌వేశించి రాజ్యస‌భ‌లో మెంబ‌ర్ గా ఉండి పార్ల‌మెంట్ లో త‌న వాణిని వినిపించారు. మోహ‌న్ బాబు గార్ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను అన్నారు.

జ‌య‌సుధ మాట్లాడుతూ... ఈరోజు మోహ‌న్ బాబు 40 సంవ‌త్సరాలు పూర్తి చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. మేమిద్ద‌రం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. నేను హీరోయిన్గా న‌టించిన‌ప్పుడు మోహ‌న్ బాబు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసారు. అప్పుడే అదే గాంభీర్యం. నా ద‌గ్గ‌రికి వ‌చ్చి డైలాగ్ ఎలా చెప్పాలో చెప్పేవాడు. ఆత‌ర్వాత ఇద్ద‌రం కల‌సి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాం. మేమిద్దరం క‌లిసి న‌టించిన కొన్ని సినిమాలు సంవ‌త్స‌రం పాటు ఆడి రికార్డ్ క్రియేట్ చేసాయి. మేము 40 ఏళ్లు అయినా ఇంకా న‌టిస్తున్నాం అంటే ఆ క్రెడిట్ దాస‌రి గారికే చెందుతుంది. మోహ‌న్ బాబు గారు 50 సంవ‌త్స‌రాల వేడుక‌ను కూడా వైజాగ్ లోనే జ‌రుపుకోవాలి. ఆ వేడుక‌లో మీమంద‌రం పాల్గొనాలి అని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ రావు మాట్లాడుతూ....ఈరోజు సుబ్బిరామిరెడ్డి పుట్టిన‌రోజు అంద‌రూ శుభాకాంక్ష‌లు చెప్ప‌టానికి వ‌చ్చారు. మేము కూడా వ‌చ్చాం. అయితే కేవ‌లం శుభాకాంక్ష‌లు మాత్ర‌మే చెప్ప‌డానికి రాలేదు. ప్ర‌తి పుట్టిన‌రోజును మంచి కార్య‌క్ర‌మం చేస్తున్నారు. ఈరోజు కార్య‌క్ర‌మం చ‌రిత్ర‌లో నిలిచిపోయే కార్య‌క్ర‌మం. 40 ఏళ్ల సుదీర్ఘ న‌ట ప్ర‌స్ధానం పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మోహ‌న్ బాబుకు స‌న్మానం చేసారు. ఇది మోహ‌న్ బాబుకు చేసిన స‌న్మానం కాదు ఒక సామాన్యుడు ఎలా విజ‌యం సాధించి 40 ఏళ్లుగా అంద‌రి మ‌న‌సుల్లో స్ధానం సంపాదించుకున్నాడు అనేది తెలియ‌చేయ‌డానికి ఏర్పాటు చేసిన స‌భ... స‌న్మానం ఇది. ఇవాళ వ‌స్తున్న జ‌న‌రేష‌న్ చూస్తుంటే 5 సంవ‌త్స‌రాల‌కే అలిసిపోతున్నారు. 10 సంవ‌త్స‌రాలు చాలు అనుకుంటున్నారు. కానీ ఇక్క‌డ వేదిక పై ఉన్న వాళ్లు 40 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న వాళ్లే ఉన్నారు. మోహ‌న్ బాబుది 40 సంవ‌త్స‌రాల చ‌రిత్రైతే అది కృషి దీక్ష‌ ప‌ట్టుద‌లతో పెరిగితే చిరంజీవిది కూడా అదే సుదీర్ఘ చ‌రిత్ర‌. వెంక‌టేష్ బాబుది కూడా అదే చ‌రిత్ర జ‌రుగుతుంది. అలాగే జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి ప‌రుచూరి గోపాల‌కృష్ణ ..వీళ్లంద‌రిది సుదీర్ఘ చ‌రిత్ర‌. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే మ‌నిషిని టాలెంట్, క్ర‌మ‌శిక్ష‌ణ‌, సిన్సియారిటి ఇవ‌న్నీ స‌క్సెస్ వైపు న‌డిపిస్తాయి. ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం నిల‌బ‌డిన వాళ్లు కేవ‌లం కృషితో పైకి వ‌చ్చిన వాళ్లు. సుబ్బిరామిరెడ్డి గారు ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. నేను అనుకునేవాడిని ఆయ‌న ఎందుకు ఇంత భారీ ఫంక్ష‌న్స్ చేస్తున్నారు. ప‌బ్లిసిటీ కోస‌మా. ఫోటోలు కోస‌మా అని ఆలోచించేవాడిని. చాలా మంది ఇలానే అనేవారు. పూర్వం స‌న్మానాలు అనేవి రాజులు చేసేవాళ్లు. త‌ర్వాత జ‌మీందార్లు చేసేవాళ్లు. ప్ర‌భుత్వాలు చేయ‌డం మానేసాయి. ఇలాంటి సుబ్బ‌రామిరెడ్డి గారు లాంటి వాళ్లైనా చేయ‌క‌పోతే క‌ళాకారుల ఘ‌న‌త ఎలా తెలుస్తుంది అనిపించింది. ఈ సంద‌ర్భంగా సుబ్బిరామిరెడ్డి గార్ని అభినందిస్తున్నాను. షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చిరంజీవి రావ‌డం, ఫంక్ష‌న్స్ కి దూరంగా ఉండే వెంక‌టేష్ రావ‌డం..ముంబాయి నుంచి జ‌య‌ప్ర‌ద, శ్రీదేవి, జ‌య‌సుధ వీళ్లంతా ఎందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చారంటే ఒక‌టి సుబ్బిరామిరెడ్డి పిలుపు రెండు మోహ‌న్ బాబు గుండె మ‌లుపు. వినోద్ ఖ‌న్నా, ర‌జ‌నీకాంత్, మోహ‌న్ బాబు, చిరంజీవి వీళ్లంద‌రూ ఇంత కాలం స‌క్సెస్ ఫుల్ గా ఉన్నారంటే కార‌ణం విల‌న్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆత‌ర్వాత హీరో అయ్యారు. విల‌న్ వేషం వేయ‌గ‌లిన వాడు ఆల్ రౌండ‌ర్. హీరో వేషం వేసిన‌వాడు విల‌న్ గా వేసి స‌క్సెస్ అవ్వ‌డం క‌ష్టం. అందుకే వీళ్లంద‌రూ ఇండియ‌న్ సినిమాలో లెజండ‌రీస్ గా నిలిచారు. ఈరోజు మోహ‌న్ బాబుకు స‌న్మానం జ‌రుగుతుంది అంటే ఒక గురువుగా నాకంటే ఆనంద‌ప‌డేవాడు ఇంకొక‌రు ఉండ‌రు అన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ... సుబ్బిరామిరెడ్డి విశాఖ ప్ర‌జ‌లే కుటుంబ స‌భ్యులుగా భావించి త‌న‌ పుట్టిన‌రోజును ఎప్పుడూ విశాఖ‌లోనే జ‌రుపుకుంటున్నందుకు అభినందిస్తున్నాను. ఈరోజు వేడుక‌కు పార్టీల‌కు అతీతంగా రాజ‌కీయ నాయ‌కులు సినీ ప్ర‌ముఖులు సాహితీవేత్త‌లు వ‌చ్చారంటే దానికి కార‌ణం సుబ్బిరామిరెడ్డి గారి క‌ళా హృద‌య‌మే. నాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, నా మ‌న‌సుకి అతి ద‌గ్గ‌రైన వ్య‌క్తి ప‌ద్మ‌శ్రీ మంచు మోహ‌న్ బాబు. నేను ప్ర‌త్యేకించి ఇక్క‌డకు రావ‌డానికి కార‌ణం కేవ‌లం మోహ‌న్ బాబు గురించే వ‌చ్చాను. ఆయ‌న నెల క్రితం ఏమ‌య్య చిరంజీవి నేన‌య్యా మోహ‌న్ బాబుని విశాఖ‌లో నాకు స‌న్మానం నువ్వు రావాలి అన్నారు. త‌ప్ప‌కుండా వ‌స్తాను అన్నాను. ఎందుకంటే రాను అంటే పెద్ద డిష్క‌స‌న్. వ‌స్తాను అనే వర‌కు వ‌దిలిపెట్ట‌డు. అయితే...సినిమా చేస్తున్నాను క‌దా..ఈరోజు షూటింగ్ ప్లాన్ చేసేసారు. అప్పుడు వాళ్ల‌కు షూటింగ్ క్యాన్సిల్ చేయండి లేక‌పోతే అవ‌త‌లి రాక్ష‌సుడు లాంటి వ్య‌క్తి అని చెబితే షూటింగ్ క్యాన్సిల్ చేసారు. రాక్ష‌సుడు అని ఎందుకు అంటున్నాను అంటే రాక్ష‌స ప్రేమ చూపిస్తాడు. అయితే నేను, చిరంజీవి స‌ర‌దాగా మాట్లాడుకుంటాం. కానీ బ‌య‌ట టామ్ & జెర్రీ అనుకుంటారు. సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రి మ‌ధ్య చాలా గొడ‌వ ఉంది శ‌త్రుత్వం ఉంది అంటూ ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేస్తుంటారు. ఈ విష‌యాన్ని మోహ‌న్ బాబుతో చెబితే అనుకుంటే అనుకోనివ్వు అని అంటాడు కానీ సీరియ‌స్ గా తీసుకోడు. నాదీ అదే ప‌ద్ద‌తి. మోహ‌న్ బాబు నాకు అన్నివేళ‌లా చాలా కావాల్సిన వాడు. ఈరోజు నా ఆప్తుడుకు 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా స‌న్మానం చేయ‌డం నేను పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది మోహ‌న్ బాబుకు జ‌రుగుతున్న స‌న్మానం కాదు 40 ఏళ్ల సుదీర్ఘ ప్ర‌స్తానానికి జ‌రుగుతుంది. ఒక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు జ‌రుగుతుంది. మ‌నిషి అనుకుంటే సాధించ‌లేనిది ఏదీ లేదు అనే ప‌ట్టుద‌ల‌కు జ‌రుగుతున్నస‌న్మానం ఇది. నాది 37 ఏళ్ల ప్ర‌యాణం మా ఇద్ద‌రిది దాదాపుగా స‌మాంత‌రంగా వ‌స్తున్న సుదీర్ఘ ప్ర‌యాణం. ఇంకా అలుపు అనేది లేకుండా ప్ర‌యాణిస్తూ ఎంద‌రికో ఆద‌ర్శంగా నిలిచారు అన్నారు.

డా. మోహ‌న్ బాబు మాట్లాడుతూ... ఎక్క‌డో మారుమూల కాళ‌హ‌స్తి ద‌గ్గ‌ర ప‌ల్లెటూరులో జ‌న్మించి 8 కిలో మీట‌ర్లు న‌డిచి వెళ్లి స్కూలుకు వెళ్లేవాడిని. డ‌బ్బు లేక ఎక్కువ చ‌దువుకోలేక‌పోయాను. బి.ఎ వ‌ర‌కు చ‌దివాను. ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ట్రైనింగ్ చేసి మ‌ద్రాసులో ఒక సంవ‌త్స‌రం పాటు ఉద్యోగం చేసాను. వాళ్ల కులం వాడిని కాదు అని న‌న్ను ఉద్యోగం లోంచి తీసేస్తే కారు షెడ్యులో ఉంటూ జీవితం స్టార్ట్ చేసాను. ప్లాట్ ఫార‌మ్ పై ప‌డుకుని న‌టుడు అవ్వాల‌ని ప్ర‌యాణం ప్రారంభించాను. ఆ ప్ర‌యాణంలో క‌నిపించి మొట్ట‌మొద‌టి వ్య‌క్తి దాస‌రి నారాయ‌ణ‌రావు గారు. ఆయ‌న డైలాగ్ రైట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్న సినిమాకి అప్రంటీస్ గా వ‌ర్క్ చేస్తే ఆరు మ‌సాల‌కు 50 రూపాయ‌ల జీతం ఇచ్చారు. తిన‌డానికి తిండి లేక క‌ట్టుకోవ‌డానికి బ‌ట్ట‌లు లేక చాలా క‌ష్టాలు ప‌డ్డాను. దాస‌రి స్వ‌ర్గం న‌ర‌కంలో న‌టించేంత వ‌ర‌కు ఒక పూట తిని మ‌రొక పూట తిన‌కుండా క‌ష్ట‌ప‌డ్డాను. 1975లో స్వ‌ర్గం న‌ర‌కంలో దాస‌రి గారు అవ‌కాశం ఇవ్వ‌డం పూర్వ జ‌న్మ‌సుకృతం.

నాకు తండ్రి త‌ర్వాత తండ్రి లాంటి వ్య‌క్తి మా గురువు గారు. నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది విల‌న్ పాత్ర వేయాల‌నే హీరో పాత్ర వేయాల‌ని కాదు. ఆవిధంగా జీవితం ప్రారంభ‌మ‌యి మ‌హా న‌టుల‌తో న‌టించాను. దాదాపు 560 చిత్రాల్లో విభిన్న పాత్ర‌లు పోషించాను. 60 చిత్రాల‌కు పైగా నిర్మించాను. చంద్ర‌బాబు ఆశీస్సుల‌తో పార్ల‌మెంట్ కి వెళ్లాను. ఇదంతా సాధించాను అంటే నా త‌ల్లిదండ్రులు నాకు ప్ర‌సాదించిన ఆశీస్సులు. ఆత‌ర్వాత నా గురువు గారు ప్ర‌సాదించిన ఆశీస్సులు. ఒక కులం వాడు ఆశీర్వ‌దిస్తే గొప్ప‌వాడు కాలేడు. అంద‌రూ ఆశీర్వ‌దించాలి అంద‌రూ సినిమా చూడాలి. అందుక‌నే కుల‌మ‌తాల‌కు అతీతంగా విద్యాల‌యాలు ప్రారంభించాను. దాదాపు 14,500 మంది విద్యార్ధులు మా విద్యాసంస్ధ‌ల్లో చదువుకుంటున్నారు. భార‌త‌దేశంలో 3600 విద్యాల‌యాలు ఉంటే అందులో మా సంస్థ 6వ స్ధానంలో ఉంది. కుల‌మ‌తాల‌కు అతీతంగా ఉచిత విద్యాను అందిస్తున్నాం. చిరంజీవి నాకు క‌ల‌లో కూడా చెడు చేయ‌లేదు. నేను అత‌నికి చెడు చేయ‌లేదు. చెడు చేయ‌ను కూడా. అక్కినేనికి ఎన్టీఆర్ కి గొడ‌వ పెట్టింది నిర్మాత‌లు. వాళ్లిద్ద‌రితో నాకు మంచి అనుబంధం అది అంద‌రికీ తెలిసిందే. మేజ‌ర్ చంద్ర‌కాంత్ సినిమాని నా ద‌గ్గ‌ర ఉన్న ఆస్తులు తాక‌ట్టు పెట్టి తీసాను. అన్న‌య్యా మిమ్మ‌ల్ని ముఖ్య‌మంత్రిగా చూస్తాను అని చెప్పాను. చెప్పిన‌ట్టుగానే అన్న‌య్య‌ను ముఖ్య‌మంత్రిగా కూర్చొబెట్టిన ఘ‌న‌త నాకే ద‌క్కింది భార్యాభ‌ర్త‌ల్లో క‌ల‌హాలు వస్తున్న‌ప్పుడు న‌టులుగా మామ‌ధ్య చిన్న‌చిన్న క‌ల‌హాలు వ‌స్తుంటాయి. కానీ చిరంజీవి, నేను ఒకరికొక‌రం చెడు చేసుకోలేదు. అల్లు రామ‌లింగ‌య్య గారు అంటే నాకు ఇష్టం. మేము అత్యంత ఆత్మీయులం. ఆ కుటుంబం కూడా క్షేమంగా ఉండాల‌ని షిర్డీ సాయినాధుడిని కోరుకుంటున్నాను. రామానాయుడు గారు న‌టీన‌టుల‌కు రెమ్యూన‌రేష‌న్ క‌రెక్ట్ గా ఇచ్చాయ్ అని చెప్పారు. ఆయ‌న చెప్పింది పాటించి నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాను. వెంక‌టేష్ తో ఎక్కువ సినిమాల్లో న‌టించ‌లేదు కానీ రామానాయుడు కుటుంబం అంటే నాకు అత్యంత ప్రేమ అనురాగం. రామారావు గారు, నాగేశ్వ‌ర‌రావు గారు, రామానాయుడు గారు లేని లోటు క‌నిపిస్తుంది. జ‌య‌ప్ర‌ద‌తో హీరోగా విల‌న్ గా కూడా న‌టించాను. ఎంతో దూరం నుంచి నా ఫంక్ష‌న్ కి వ‌చ్చినందుకు అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. జ‌య‌సుథ నిజ జీవితంలో చెల్లెలు. అదే జ‌య‌సుధ‌తో హీరోగా న‌టించాను. ఇది దేవుడి ఆశీస్సులు. ఎవ‌రైనా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటే ఎప్ప‌టికైనా దేవుడు ఆశీర్వ‌దిస్తాడు. సుబ్బిరామిరెడ్డి గారు ఇలాగే వందేళ్లు న‌వ్వుతూ ఉండాలి క‌ళాకారుల‌ను స‌న్మానిస్తూ ఉండాలిని కోరుకుంటూ పాదాభివంద‌నం చేస్తున్నాను అన్నారు.