National Leaders:బాబును నమ్మలేం : పట్టించుకోని జాతీయ నేతలు.. హస్తినలో లోకేష్ పాట్లు, ఎలా ముందుకు ..?

  • IndiaGlitz, [Saturday,September 23 2023]

14 ఏళ్లు సీఎం, మరో 14 ఏళ్లు ప్రతిపక్షనేత.. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. రాష్ట్రపతులను, ప్రధాన మంత్రులను ఎంపిక చేసి కేంద్రాన్ని కనుసైగతో శాసించిన నేత. ఆయన ఎవరో ఈ పాటికే మీకు అర్ధమై వుంటుంది. ఆయనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి నేతను జాతీయ స్థాయి నేతలెవ్వరూ పట్టించుకోవడం లేదు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ జైలుకు వెళ్లలేదు. అవినీతి ఆరోపణలు, కేసులు చుట్టుముట్టినా ముందే స్టేలు, ముందస్తు బెయిల్‌లు తెచ్చుకుని నెట్టుకొచ్చారు. కానీ జీవితంలో తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం చంద్రబాబును జైలుకు పంపింది. దాదాపు 15 రోజులుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. బెయిల్ కోసం ఢిల్లీ నుంచి లాయర్లను దింపినా ప్రయోజనం కనిపించడం లేదు.

ఢిల్లీలో లోకేష్ చక్కర్లు :

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు ప్రాంతాల్లో చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఆందోళనలు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్, బెంగళూరులలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నిరసన నిర్వహించారు. రానున్న రోజుల్లో ఆందోళన ఉద్ధృతం చేయాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఇంతలో మన తెలుగుదేశం యువ కిశోరం, ఆ పార్టీ భావి సారథి ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, దానిని జాతీయ నేతలకు, జాతీయ మీడియాకు తెలియజేయాలని లోకేష్ భావించారు. కానీ నేషనల్ మీడియా ముందు ఆయన పప్పులు ఊడకలేదు. సీనియర్ జర్నలిస్ట్ అర్ణాబ్ గోస్వామి అయితే లోకేష్‌ను ఓ ఆట ఆడుకున్నారు. ఆయన ప్రశ్నల ధాటికి ఏం చెప్పాలో తెలియక లోకేష్ నీళ్లు నమిలారు. చూస్తుంటే చంద్రబాబుకు ఢిల్లీలో మిగిలిన కాస్త పరువును కూడా లోకేష్ మిగిల్చేలా కనిపించడం లేదు.

స్పందించని జాతీయ నేతలు :

చంద్రబాబుకు జాతీయ స్థాయిలో మద్ధతు కూడగట్టేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తమతో అంటకాగి కాంగ్రెస్‌తో చేరి తమను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుపై ఇప్పటికే బీజేపీ నేతలకు నమ్మకం పోయింది. ఆయన ఎంతలా ప్రాథేయపడినా ఏపీలో పొత్తు పెట్టుకునేందుకు కమలనాథులు సిద్ధంగా లేరు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుతో చెట్టాపట్టలేసుకుని తిరిగిన అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కుమారస్వామి, ఫరూక్ అబ్ధుల్లా, లెఫ్ట్ నేతలు ఇలా ఎవ్వరూ కూడా ఈ విషయంపై మాట్లాడటం లేదు. నమ్మకద్రోహానికి పర్యాయపదంలా మారిన ఆయనను ఇటీవలి కాలంలో ఏ కూటమి కూడా పట్టించుకోవడం లేదు. ఎన్డీయే కానీ, ఇండియా కూటమి గానీ దేనిలోకి చేర్చుకోవడం లేదు.

ఇతర పార్టీల ఎంపీలను ఫోటోల కోసం బతిమాలుకుంటున్న టీడీపీ నేతలు :

ఇదిలావుండగా.. టీడీపీ ఎంపిలు, నేతలు , లోకేష్ తదితరులు ఇతర పార్టీ ఎంపీలను బలవంతాన ఫోటోకు ఒప్పించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇది చూపించి ఫలానా పార్టీ మాకు మద్ధతు ఇచ్చింది.. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించింది అంటూ అనుకూల మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎక్కడో ఢిల్లీలోనే కాదు.. సొంత రాష్ట్రంలో చంద్రబాబుకు ప్రజల నుంచి మద్ధతు కరువైంది. ఆయనను అరెస్ట్ చేసినప్పుడు జనం తమ పనులు తాము చూసుకున్నారే తప్పించి ఎవ్వరూ రోడ్డెక్కలేదు. అచ్చెన్నాయుడు ఈ విషయంలో అసహనం వ్యక్తం చేసి అడ్డంగా బుక్కైపోయారు. ఆ తర్వాత టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు కూడా ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. స్వయంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హేరిటేజ్ సంస్థకు చెందిన ఔట్‌లెట్లు, డైరీ పార్లర్‌లు కూడా యథావిధిగా నడిచాయంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

టీడీపీకి అన్నింటా వ్యతిరేక పవనాలు :

మరోవైపు ఐటి ఉద్యోగుల పేరిట హైదరాబాద్, బెంగళూరు, విదేశాల్లో ధర్నాలు చేసిన వారు అసలు టెక్కీలు కాదని తేలిపోయింది. వారిలో ఎక్కువమంది కర్రీ పాయింట్లు నడిపేవారు.. చిన్నా చితకా ఉద్యోగులే ఉన్నారు తప్ప ఐటి, సాప్ట్ వేర్ ప్రొఫెషనల్స్ లేరని తేలింది. అన్ని వైపుల నుంచి తమకు ప్రతికూల పవనాలు వీస్తుండటంతో టిడిపి కక్కలేక మింగలేక అవస్థలు పడుతోంది. దీంతో ఎలా ముందుకు పోదామన్నది తెలియక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక పార్టీని నడిపించేవారు లేక కేడర్‌ కూడా ఎక్కడికక్కడ నిస్తేజంగా మారిపోయారు.