నేషనల్ అవార్డు విన్నర్, డైరెక్టర్ విశ్వేశ్వరరావు కన్నుమూత.. ఎన్టీఆర్ తో..
- IndiaGlitz, [Thursday,May 20 2021]
ప్రముఖ నిర్మాత, దర్శకుడు విశ్వేశ్వరరావు కన్నుమూశారు. కరోనా సోకడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ ఉదయం చెన్నైలో మృతి చెందారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించారు. విశ్వేశ్వరరావు ఎవరో కాదు.స్వయానా సీనియర్ ఎన్టీఆర్ కు వియ్యంకుడే.
ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ ఈయనకు అల్లుడు. విశ్వేశ్వరరావు కంచుకోట, నిలువుదోపిడీ, దేశోద్ధారకులు, పెత్తందార్లు అనే చిత్రాలని ఎన్టీఆర్ తో నిర్మించారు. ఆ తర్వాత దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. తీర్పు, మార్పు, నగ్న సత్యం,కీర్తి కాంతా కనకం, పెళ్లిళ్ల చదరంగం అనే చిత్రాలు విశ్వేశ్వరరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్నాయి.
ఆయన తెరకెక్కించినవి ఆషామాషీ చిత్రాలు కాదు. 1979లో నగ్న సత్యం చిత్రంకి గాను ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే 1980 లో హరిశ్చంద్రుడు చిత్రానికి కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు. విశ్వేశ్వరరావు విప్లవ భావాలు కలిగిన వ్యక్తి. ఎన్టీఆర్, విశ్వేశ్వర రావు కంబోలోనే నాలుగు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.
దీనితో ఆయన స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూనే కళాత్మక చిత్రాలకు కూడా ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. సినిమా పట్ల అమితమైన ఇష్టం పెంచుకున్న దర్శక నిర్మాత విశ్వేశ్వరరావు మృతి చిత్ర పరిశ్రమకు లోటే. సామాన్యులతో పాటు ప్రముఖుల్ని బలితీసుకున్న కరోనా విలయతాండవం కొనసాగుతోంది.