Download App

Natakam Review

ఆర్‌.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి చిత్రాలు సాధించిన విజ‌యాల‌తో రా కంటెంట్‌తో సినిమాలు తీయాల‌నుకునే వారు ఎక్కువైయ్యారు. ఈ త‌రుణంలో ప‌లు చిత్రాల్లో చిన్న సైజ్ విల‌న్‌గా న‌టించిన ఆశిష్ గాంధీ హీరోగా చేసిన చిత్ర‌మే `నాట‌కం`. సినిమా టీజ‌ర్‌లోని హాట్ సీన్స్‌, లిప్ లాక్స్ ఇదేమైనా మ‌రో ఆర్‌.ఎక్స్ 100 అవుతుందా? అనే రేంజ్‌లో కొంత ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను పెంచాయి. మ‌రి నాట‌కం ఈ అంచ‌నాల‌ను అందుకుందా?   లేదా? ఆశిష్ గాంధీకి హీరోగా బ్రేక్ వ‌చ్చిందా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందు క‌థ‌లోకి వెళ‌దాం..

క‌థ‌:

దారి దోపీడీల‌తో పాటు గ్రామాల‌పై దాడి చేసి దోచుకునే ఓ దోపిడీ ముఠా ఉంటుంది. ఈ ముఠా ఓ ఊళ్లో 72 మందిని చంపేసి ఉంటుంది. వారి కోసం పోలీసులు వెతుకుతుంటారు. మ‌రో వైపు చింత‌ల‌పూడి గ్రామంలో కోటి(ఆశిష్ గాంధీ) ఏ ప‌నీ పాటా లేకుండా బ‌లాదూర్‌గా తిరుగుతుంటాడు. సాయంత్రాలైతే మందు కొట్టడం.. పొందు కోసం వెతుక్కోవ‌డ‌మే అత‌ని ప‌నిగా ఉంటుంది. పెళ్లి చేసుకుందామంటే అత‌ని ప్ర‌య‌త్నాలన్నీ బెడిసి కొడుతుంటాయి. ఓ రోజు కోటి అనాథ అయిన పార్వ‌తి(ఆషిమా)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఆమె ప్రేమ కోసం వెంబ‌డి ప‌డ‌తాడు. పార్వ‌తి కూడా కోటిని ప్రేమిస్తుంది. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటారు. అంతా స‌వ్యంగా సాగుతుంద‌నుకుంటున్న త‌రుణంలో దోపిడీ ముఠా చింత‌ల‌పూడి గ్రామంలోకి ప్ర‌వేశిస్తుంది. వారికి, పార్వ‌తికి ఉన్న సంబంధం ఏంటి?  చివ‌ర‌కు కోటి దోపిడీ దొంగ‌ల‌ను ఎలా అడ్డుకున్నాడ‌నేదే  సినిమా

విశ్లేష‌ణ‌:

సినిమా ప్రారంభం దోపిడీ దొంగ‌ల ముఠాతో ప్రారంభం అవుతుంది. ఆ సీన్స్‌.. వారి గురించి ఇచ్చే ఇంట్రడ‌క్ష‌న్ బాగానే ఉంది. ఇక హీరో లుక్‌, బాడీలాంగ్వేజ్ అన్ని ప‌ల్లెటూరి స్టైల్లో చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ స‌క్సెస్ అయ్యాడు. అలాగే హీరో, హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ సీన్స్ యూత్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఆశిష్ గాంధీ, ఆషిమా న‌ట‌న ప‌రంగా బాగా మెప్పించారు. ముఖ్యంగా ఆషిమా రొమాంటిక్ సీన్స్‌లో న‌టించ‌డానికి వెన‌క‌డుగు వేయ‌లేదు. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా మ‌లుచుకోవ‌డంలో విఫ‌లమ‌య్యాడు. చాలా వ‌ర‌కు క‌థ‌కు అవ‌స‌రం లేని స‌న్నివేశాలు.. హీరో బిల్డ‌ప్ స‌న్నివేశాలు మాత్ర‌మే క‌న‌ప‌డ‌తాయి. మ‌రి అంత అవ‌స‌రం లేదేమో అనిపిస్తుంది. అలాగే ర‌క్త‌పాతం మ‌రి డోస్ పెంచేశారు. సినిమాను క్లైమాక్స్‌లో కోర్ట్ సీన్‌తో మ‌రింత సాగ‌దీశారు. ల‌వ్‌స్టోరిని హ్యాండిల్ చేసిన తీరు.. దానికి ప్ర‌ధాన పాయింట్‌ను జ‌త చేసి తెర‌కెక్కించిన తీరు ద‌ర్శ‌కుడు ప‌నితీరు చెప్పేశాయి. ఇక సాయికార్తీక్ ట్యూన్స్‌లో యాడ పుట్టినావే సాంగ్ మిన‌హా మ‌రేవీ ఎఫెక్టివ్‌గా లేవు. నేప‌థ్య సంగీతం బావుంది. కెమెరా ప‌నితనం బావుంది.

బోట‌మ్ లైన్‌: నాట‌కం.. ర‌క్తి క‌ట్ట‌లేదు

Rating : 1.5 / 5.0