Nassar:కోలీవుడ్‌పై తప్పుడు ప్రచారం.. అలాంటి రూల్స్ లేవు, రోజా భర్తకు సపోర్ట్ : పవన్ వ్యాఖ్యలపై నాజర్ స్పందన
- IndiaGlitz, [Friday,July 28 2023]
తమిళ సినిమాల్లో తమిళులకే అవకాశాలు ఇవ్వాలని.. తమిళ సినిమాలు తమిళనాడులోనే షూటింగ్‌లు జరుపుకోవాలంటూ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) ప్రకటించినట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై ‘‘బ్రో ’’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పర భాషా నటులను అనుమతించకపోవడం సరికాదన్నారు. ఇలాగే జరిగితే తమిళ చిత్ర పరిశ్రమ ఎదగదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా కోలీవుడ్ పెద్దలు మారి.. ఆర్ఆర్ఆర్ తరహా సినిమాలు తీయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తమిళ నటుడు , నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ స్పందించారు.
అలాంటి రూల్స్‌ను ముందు నేనే వ్యతిరేకిస్తా :
ఎఫ్ఈఎఫ్ఎస్ఐ ఇలాంటి నిబంధనలేవి పెట్టలేదని.. కోలీవుడ్‌ను ఉద్దేశించి చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ తమిళ చిత్ర పరిశ్రమల్లో అలాంటి నిబంధనలు వస్తే.. వ్యతిరేకించే వారిలో తాను ముందుంటానని నాజర్ అన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోందని.. వివిధ ప్రాంతాలకు చెందిన నటీనటులు, టెక్నీషియన్స్ కలిస్తేనే మంచి సినిమాలు తీయవచ్చని ఆయన పేర్కొన్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన కార్మికుల రక్షణ కోసమే ఎఫ్ఈఎఫ్ఎస్ఐ కొన్ని నిబంధనలను తీసుకొచ్చిందని.. అంతే తప్పించి ఇతర భాషలకు చెందిన నటీనటులకు చెందినవి కావన్నారు. పవన్ కల్యాణ్‌పై తనకు గౌరవం వుందని.. అందరూ కలిస్తే గొప్ప చిత్రాలు వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను తాను కూడా అంగీకరిస్తానని నాజర్ చెప్పారు. ఎఫ్ఈఎఫ్ఎస్ఐ నిబంధనలపై ఆయనకు ఎవరో తప్పుడు సమాచారం అందించారని నాజర్ వ్యాఖ్యానించారు.
సెల్వమణి నిబంధనలు వేరే :
తమిళ సినీ కార్మికుల సంక్షేమం కోసం సెల్వమణి నిబంధనలు తీసుకువచ్చారని.. వాటి పరిధిలోకి నటులు రారని ఆయన పేర్కొన్నారు. తమిళ పరిశ్రమకు చెందిన ఫెఫ్సీ, తదితర యూనియన్లలో 24 వేల మంది కార్మికులు వున్నారని.. తమిళ సినిమాల్లో స్థానిక కార్మికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నది ఇక్కడ అసలు నిర్ణయమన్నారు. అయితే వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఆ నోటా ఈ నోటా మరోలా ప్రచారం అవుతున్నాయని నాజర్ మండిపడ్డారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఎవరూ తీవ్రంగా పరిగణించవద్దని ఆయన కోరారు. ప్రస్తుతం తెలుగు, తమిళం అని కాదు.. టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు.. పాన్ ఇండియా సినిమాలు అంటున్నామని నాజర్ చెప్పారు.