‘విక్రమ్’ ల్యాండర్ జాడ తెలిసింది.. కనిపెట్టింది మనోడే!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా.. అది కుప్పకూలిన విషయం విదితమే. అయితే అప్పట్లో ఈ వ్యవహారంపై చాలా పెద్ద చర్చే జరిగింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ల్యాండర్ జాడను శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. అయితే విక్రమ్ ల్యాండర్ జాడను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కనిపెట్టింది. ఆ ప్రాంతంలో ఇన్నాళ్లూ చీకటిగా ఉండటం, దానికి తోడు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ల్యాండర్ జాడను కనుగొనడానికి శాస్త్రవేత్తలు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ఆ చీకటి తొలగిపోయి ఆ ప్రాంతంలో వెలుగు రావడంతో ల్యాండర్ జాడను నాసా కనిపెట్టింది. మంగళవారం రోజున ఇందుకు సంబంధించిన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది.
ఇలా దొరికింది..!
ల్యాడర్ ఎక్కడ కూలిందో గుర్తించామని.. ల్యాండర్ నుంచి కొన్ని శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని.. మొత్తం 24 చోట్ల ఈ శకలాలు కనిపిస్తున్నాయని నాసా ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. సుమారు ఒక కిలోమీటర్ పరిధిలో విక్రమ్ ల్యాండర్ శకలాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నాసా ప్రకటనతో షార్‌లోని శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 6వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చివరి క్షణాల్లో అది క్రాష్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ ఆచూకీని కనిపెట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అహర్నిశలు శ్రమించి చివరికి వాటి శకలాలను గుర్తించింది.
మనోడు ముందే కనిపెట్టాడుగా..!
కాగా.. ఈ విక్రమ్‌ను ఫలానా చోట ఉందని తొలుత గుర్తించింది మాత్రం చెన్నైకి చెందిన ఓ సాధారణ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ అని తెలుస్తోంది. విక్రమ్ ల్యాండర్ కూలిపోయిన ప్రాంతానికి సంబంధించిన చిత్రాలను అధ్యయనం చేసిన ఆయన ఎట్టకేలకు వాటి శకలాలు ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ‘విక్రమ్ ఆనవాళ్లను నాసా గుర్తించకపోవడం నాలో ఆసక్తిని పెంచింది. నాసా విడుదల చేసిన రెండు చిత్రాలను నా లాప్ టాప్‌లో పక్కపక్కనే పెట్టుకుని తేడాను గమనించడం మొదలు పెట్టాను. విక్రమ్ ఆనవాళ్లను గుర్తించడం చాలా కష్టమైన పనే అయినప్పటికీ.. నా వంతు ప్రయత్నాన్ని చేశాను. ఆ తర్వాత నేను కనుక్కున్నదాన్ని అక్టోబర్ 3న ట్విట్టర్ ద్వారా వెల్లడించాను’ అని ఈ సందర్భంగా సుబ్రమణియన్ గుర్తు చేశారు. మొత్తానికి చూస్తే నాసా కంటే ముందుగా మనోడో కనిపెట్టాడని చెప్పుకోవచ్చన్న మాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout