Download App

Narthanasala Review

ఎన్టీఆర్ సినిమా టైటిల్‌ను పెట్ట‌డం.. బృహ‌న్న‌ల త‌రహ పాత్ర‌లో హీరో గే పాత్ర‌లో న‌టించ‌డం వ‌ల్ల... ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ అనే విష‌యాన్ని కూడా ఈ సినిమాలో ట‌చ్ చేశామ‌ని యూనిట్ చెప్ప‌డంతో .. ఇదే బ్యాన‌ర్‌లో హిట్ సినిమా చేయ‌డం త‌దిత‌ర అంశాల‌తో సినిమాపై ఆస‌క్తి పెరిగింది. మ‌రి ఈ సినిమాతో నాగ‌శౌర్య మ‌రో స‌క్సెస్ సాధించాడా? అనేది తెలియాలంటే ముందు క‌థేంటో చూద్దాం....

క‌థ‌

రాధాకృష్ణ (నాగ‌శౌర్య‌) అమ్మాయిల‌కు అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటాడు. మ‌హిళ‌లకు సెల్ప్ ప్రొటెక్ష‌న్ కోసం ప‌లు విద్య‌ల‌ను నేర్పుతుంటాడు. సాహ‌స‌వంత‌మైన అమ్మాయిలంటే ఇష్ట‌ప‌డ‌తాడు. ఆ క్ర‌మంలో స‌త్య‌భామ (యామినీ భాస్క‌ర్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. అత‌ని ఇష్టాన్ని ప్రేమ‌గా అపార్థం చేసుకున్న అత‌ని తండ్రి క‌ళామందిర్ క‌ల్యాణ్ (శివాజీరాజా) వెళ్లి అమ్మాయి ఇంట్లో సంబంధం మాట్లాడ‌తాడు. స‌త్య‌భామ తండ్రి పెద్ద గూండా. అత‌ని కుమారుడు అజ‌య్ కూడా పెద్ద గూండానే. త‌మ అమ్మాయిని పెళ్లి చేసుకోక‌పోతే రాధాకృష్ణ కుటుంబాన్ని చంపేస్తామ‌ని బెదిరిస్తారు. దాంతో ఉన్న‌ప‌ళాన తాను గే అని చెప్పుకుంటాడు రాధాకృష్ణ‌. అక్క‌డే ఉన్న అజ‌య్ వెంట‌నే రాధాతో క‌నెక్ట్ అవుతాడు. స‌త్య‌భామ చిన్నాన్న కుమార్తె అంటూ ఒక‌మ్మాయి (క‌శ్మీరా) ఆ ఇంట్లోకి ప్ర‌వేశిస్తుంది. ఆమెతో అంత‌కుముందే ప్రేమ‌లో ప‌డతాడు రాధా. వీళ్ల క‌థ ఏమైంది? స‌త్య‌భామ ఏమైంది? మ‌ధ్య‌లో తాను కూడా గే అని ఒప్పుకొన్న అజ‌య్ ఏం చేశాడు? క‌ళామందిర్ క‌ల్యాణ్ ఫ్యామిలీకి ముప్పు త‌ప్పిందా? వ‌ంటివ‌న్నీ క్లైమాక్స్ లో తెలిసే అంశాలు.

ప్ల‌స్ పాయింట్లు

నాగ‌శౌర్య తెర‌మీద అందంగా క‌నిపించాడు. న‌ట‌న కూడా ఈజ్‌తో చేశాడు. డ‌బ్బింగ్ చెప్ప‌డం బావుంది. హీరోయిన్లు ఏ మాత్రం సిగ్గుప‌డ‌కుండా అందాలు ఆర‌బోశారు. న‌టీన‌టులు వాళ్ల‌కిచ్చిన పాత్ర‌ల్ని చ‌క్క‌గా చేశారు. కెమెరా ప‌నిత‌నం బావుంది. నిర్మాత‌లు పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద క‌నిపిస్తూనే ఉంది. లొకేష‌న్లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్లు

హీరో ఏదో ఒక కార‌ణంతో విల‌న్ ఇంటికి చేర‌డం, అక్క‌డ సమ‌స్య‌ల్ని అర్థం చేసుకోవ‌డం, వారిలో ఒక‌రిగా మెలిగి, వారిని ఒక‌రికి ఒక‌రిని ద‌గ్గ‌ర చేయ‌డం...ఇది క్లుప్తంగా సినిమా. ఈ ఫార్ములా ఇప్ప‌టిది కాదు. ఈ సినిమాను చూస్తుంటే  అప్పుడెప్పుడో చూసిన‌ బిందాస్‌, రెడీ, డీ.. ఇంకాస్త త‌ర్వాతికొస్తే మ‌సాలా... ఈ సినిమాల‌న్నీ వ‌రుస‌క‌ట్టుకుని గుర్తుకొస్తాయి. పాత క‌థ‌కు `గే` అంశాన్ని జోడించి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అక్క‌డ‌క్క‌డా కామెడీ న‌వ్వించినా పెద్ద‌గా పండ‌లేదు. కొన్ని పాత్ర‌ల‌ను అనుకున్న తీరు బావుంది. కానీ ఆయా పాత్ర‌లు  చేసే కామెడీ, సినిమాలో ఎక్క‌డా అత‌క‌లేదు.

విశ్లేష‌ణ‌

`చ‌లో`లాంటి హిట్ అందుకుని స్వింగ్ మీదున్న నాగ‌శౌర్య వెంట‌నే ఇంకో త‌ప్పు చేశాడంటే పాప‌మ‌నే అనిపిస్తుంది. ఎందుకంటే `@న‌ర్త‌న‌శాల చాలా ఓల్డ్ ఫార్ములా. విల‌న్ ఇంట్లో దూరి వాళ్ల మ‌ధ్య స‌మ‌స్య‌ల్ని సాల్వ్ చేసి, చివ‌రికి వాళ్ల మ‌న‌సుల్ని గెలుచుకోవ‌డం మ‌న‌కు కొత్తేం కాదు. ఫ‌స్టాఫ్‌లో సినిమాలో ద‌ర్శ‌కుడు ఏం చెప్పాల‌నుకున్నాడో కూడా అర్థం కాదు. శివాజీరాజా, గుండు హ‌నుమంత‌రావు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు పండ‌లేదు. శివాజీరాజాకి, అత‌ని తండ్రి పాత్ర‌కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు విసుగుతెప్పిస్తాయి. సెకండాఫ్ లోనూ అంతే. స‌త్య‌భామ పాత్ర‌ను `న‌ర‌సింహ‌`లో ర‌మ్య‌కృష్ణ పాత్ర స్ఫూర్తితో రాసుకున్న‌ట్టు అనిపిస్తుంది. హీరో చెప్పే చిన్న మాట‌తో ఆమె మార‌డం ఏంటో అర్థం కాదు. భార్య కూర్చుని చిన్న మాట చెబితే విని, దాని ప్ర‌కారం మ‌సలుకునే ఇంటిపెద్ద.. అప్ప‌టిదాకా ప్ర‌తికూలంగా ఉన్న విష‌యాల‌న్నీ ఆయ‌న‌కు సానుకూలంగా క‌నిపించ‌డం... ఇవ‌న్నీ అంత తేలిగ్గా మింగుడుప‌డ‌వు. నిర్మాత‌లు డ‌బ్బు ఖ‌ర్చుపెట్టార‌నే సంగ‌తి బాగా అర్థ‌మ‌వుతుంది. కానీ ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.  పాట‌లు కూడా పెద్ద‌గా విన‌సొంపుగా లేవు. రీరికార్డింగ్ ఫ‌ర్వాలేదు. సినిమా క‌థ‌లోనే ప‌స లేక‌పోవ‌డంతో, ఎడిట‌ర్‌ని త‌ప్పు ప‌ట్టి ప్ర‌యోజ‌నం లేదు. యామినీ భాస్క‌ర్ ఫ‌ర్వాలేదుగానీ, మ‌రీ క‌శ్మీర ముఖంలో ఎక్స్ ప్రెష‌న్స్ అస‌లు ప‌ల‌క‌లేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే న‌ర్త‌న‌శాల ప్రేక్ష‌కుల స‌హ‌నంతో ఆడుకున్న‌ట్టే.

బాట‌మ్ లైన్‌: స‌హ‌నానికి ప‌రీక్ష @న‌ర్త‌న‌శాల‌

Read Narthanasala Movie Review in English

Rating : 2.0 / 5.0