నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతి
- IndiaGlitz, [Saturday,May 22 2021]
విశాఖపట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో అనస్థీషియన్‌గా పనిచేస్తూ ఆయన సస్పెండైన విషయం తెలిసిందే. గత ఏడాది కరోనా సమయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన హాట్ టాపిక్‌గా మారారు. కరోనా రోగులకు సేవలందిస్తున్న తమకు ఎన్ 95 మాస్కులు ఇవ్వడం లేదని, పీపీఈ కిట్లు లేవని ఆరోపించారు. దీంతో వృత్తి పరమైన నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ప్రభుత్వం ఏప్రిల్ 8న ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై డాక్టర్ సుధాకర్ తీవ్ర మనస్తాపం చెందారు.
ఇదీ చదవండి: ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్ కీలక నిర్ణయం..
వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆరోపించారు. అనంతరం కూడా ఆయన విషయం సంచలనంగానే మారింది. గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం వద్ద జాతీయ రహదారిపై గలాటా సృష్టిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్‌ను నాలుగో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ను ఆ సమయంలో కొట్టడం, చేతులు విరిచికట్టడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. సుధాకర్ మతిస్థిమితం కోల్పోయారని చెప్పి పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్‌కు మానసిక స్థితి సరిగా లేదని చెప్పి మానసిక వైద్యశాలకు తరలించడంపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సీబీఐతో విచారణ చేయించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఈ నెలలోనే తీర్పు రావలసి వుంది. దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకే సుధాకర్ బలయ్యారని, సుధాకర్‌ది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం డాక్టర్ సుధాకర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.