'జంబలకిడి పంబ' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన డా.వి.కె.నరేశ్!
- IndiaGlitz, [Saturday,April 14 2018]
'జంబలకిడి పంబ' అనే పేరు వినగానే నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయకుడు. 'గీతాంజలి', 'జయమ్ము నిశ్చయమ్మురా' వంటి వైవిధ్యమైన సినిమాలతో కథానాయకుడిగా అడుగులు వేసిన శ్రీనివాసరెడ్డి నటిస్తోన్న తాజా సినిమా ఇది.
శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిశోర్ కీలక పాత్రధారులు. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని నాటి 'జంబలకిడి పంబ' హీరో డా. వి.కె.నరేశ్ హైదరాబాద్‌లో విడుదల చేశారు.
అనంతరం డా.వి.కె. నరేశ్ మాట్లాడుతూ బహుశా 'జంబలకిడి పంబ' అనే టైటిల్ ఒకటి వస్తుందని కూడా ఎవరూ ఊహించి ఉండరు. వచ్చినప్పటి నుంచీ ఎవరూ మర్చిపోలేదు. ఇలాంటి టైటిల్ మళ్లీ ఇంకో సినిమాకి పెడతారని కూడా అనుకోరు. నేను చాలా ఇష్టంతో సత్యం అని పిలుచుకునే మా ఈవీవీ సత్యనారాయణ సృష్టించిన అద్భుత కావ్యం 'జంబలకిడి పంబ'. ఈ చిత్రాన్ని 'మాయాబజార్'తో పోల్చలేం కానీ... తెలుగు సినిమాల్లో ఆణిముత్యం అని మాత్రం చెప్పవచ్చు.
ఈవీవీగారితో నాది 40 ఏళ్ల అనుబంధం. ఒకరోజు నేను తిరుపతిలో ఉండగా 'ఓ అద్భుతమైన కథ చెబుతాను' అని ఈవీవీగారు వచ్చారు. వినగానే 'రెగ్యులర్ గా లేకుండా, అద్భుతంగా ఉంది చేస్తున్నా' అని అన్నాను. 'రివర్స్ గేర్' అని టైటిల్ అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. 'అలా కాకుండా.. ఈ సినిమాకు కాస్త పాజిటివ్ టైటిల్ ఉంటే బావుంటుంది' అని నేను అన్నాను.
సరేనని వెళ్లారు. అప్పట్లో సెల్‌ఫోన్లు లేవు. మద్రాసు నుంచి తెల్లారుజామున నాలుగు గంటలకు ట్రంక్ కాల్ చేసి 'జంబలకిడి పంబ' అని అన్నారు. అదేంటంటే.. టైటిల్ అని చెప్పారు. అలా ఆ సినిమా మొదలైంది. అలీ అందులో అద్భుతమైన పాత్ర చేశారు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి మరలా అదే టైటిల్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సారథి స్టూడియోలోనే నాకు శ్రీనివాసరెడ్డి మొదటిసారి పరిచయమయ్యారు.
నేను నటించిన సినిమా టైటిల్‌తో.. అతను హీరోగా చేస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని ఇదే సారథి స్టూడియోలో లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు మను నేను లైక్ చేసే డైరక్టర్. ఈ చిత్రంతో అతనికి మరో సక్సెస్ రావాలి. చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ అని చెప్పారు.
డైరక్టర్ మారుతి మాట్లాడుతూ నరేశ్‌గారు చెప్పినట్టు ఆ టైటిల్ ని మరలా పెట్టడం కూడా సాహసమే. తెలుగు ఆడియన్ మీద ముద్ర వేసుకున్న సినిమా ఇది. అప్పట్లో అంతలా నవ్వించిన అద్భుతమైన సినిమా అది. ఈవీవీగారు దర్శకత్వం వహించిన ఆ సినిమా టైటిల్ పోస్టర్‌ని చూసినప్పుడు, థియేటర్‌లో సినిమా చూసినప్పుడు నవ్వుకున్న నవ్వులు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి.
అంతగా ప్రేక్షకాదరణ పొందిన టైటిల్‌తో సినిమా చేస్తున్నప్పుడు చాలా బాధ్యతగా చేయాలి. కొన్ని టైటిల్స్, సినిమాలను మరలా చేయడమంటే నిజంగా సాహసమే. ఆ సాహసాన్ని ఈ సినిమాతో వీళ్లు చేశారు. కథ కూడా చాలా కొత్తగా ఉంది. మ్యూజిక్ చాలా బాగా వచ్చిందని నాతో గోపీసుందర్ అన్నారు. నా ఫ్రెండ్స్ సురేశ్, వాళ్ల బ్రదర్ ఇంతకు ముందు డిస్ట్రిబ్యూషన్‌లో ఉండేవారు.
ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు కావడం ఆనందంగా ఉంది. 'జయమ్ము నిశ్చయమ్మురా' తర్వాత తొందరపడిపోకుండా, శ్రీనివాసరెడ్డి వెయిట్ చేసి ఈ సినిమా చేశారు. మంచి కథ ఎంపిక చేసుకుని దిగారు. మంచి సక్సెస్ సినిమా అవుతుంది. నాటి 'జంబలకిడి పంబ' హీరో డా.వి.కె. నరేశ్ ఈ 'జంబలకిడి పంబ' టైటిల్ పోస్టర్‌ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నరేశ్‌గారి సినిమాలను చూసి చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. ఆయనతో పాటు ఇప్పుడు వర్క్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు.
అలీ మాట్లాడుతూ జంబలకిడి పంబ అనే డైలాగ్ మా కామెడీ గురువు రేలంగిగారు చెప్పిన డైలాగ్. ఆ డైలాగుతో ఈవీవీగారు ఒక సినిమా చేశారు. ఆ చిత్రం కోసం మేమందరం నెల రోజులు వైజాగ్‌లో రకరకాల డ్రస్సులు వేసుకుని తిరుగుతుంటే, అక్కడివారందరూ 'వీళ్లేమైనా పిచ్చివాళ్లయిపోయారా నిజంగానే' అన్నట్టు చూసేవారు. అలా లీనమైపోయి చేశాం.
స్కూల్లో చిన్నపిల్లలయిపోయి చేసిన సీన్‌ను తలచుకుని షూటింగ్ పూర్తయిన రెండు రోజుల దాకా కూడా నవ్వుకుంటూనే ఉన్నాం. ఆయన పెట్టిన ఆ టైటిల్‌తో వస్తున్న చిత్రంలో మళ్లీ చేయడం చాలా ఆనందంగా ఉంది. 'జయమ్ము నిశ్చయమ్మురా' జంధ్యాల గారి టైటిల్. 'జంబలకిడి పంబ' ఈవీవీగారి టైటిల్. డా. వి.కె. నరేశ్‌గారు యాక్ట్ చేసిన ఆ సినిమా ఎంత హిట్ అయిందో ఈ సినిమా అంత హిట్ కావాలి అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ మా 'జంబలకిడి పంబ' సినిమా టైటిల్ పోస్టర్‌ని నాటి 'జంబలకిడి పంబ' హీరో డా.వి.కె.నరేశ్‌గారు ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. పోసానిగారిది ఈ చిత్రంలో చాలా కీలకమైన పాత్ర. వెన్నెలకిశోర్ కి మావగా ఆయన కనిపిస్తారు. అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించే సినిమా అవుతుంది అని చెప్పారు.
దర్శకుడు మాట్లాడుతూ 'జంబలకిడి పంబ' ఎంత సూపర్‌హిట్ టైటిలో అందరికీ తెలిసిందే. మా చిత్ర కథకు కూడా చక్కగా సరిపోయే టైటిల్ అది. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే చాలా బాగా కుదిరాయి. శ్రీనివాసరెడ్డి కేరక్టర్ చాలా బాగా కుదిరింది. ఆయన కెరీర్‌లో మరో కీలక చిత్రమవుతుంది అని అన్నారు.
నటీనటులు:
సత్యం రాజేశ్, ధన్‌రాజ్, షకలక శంకర్, హరి తేజ, రాజ్యలక్ష్మి, హిమజ, కేదారి శంకర్, మధుమణి, మిర్చి కిరణ్, జబర్దస్త్ అప్పారావు, సన, సంతోష్, గుండు సుదర్శన్, జబర్దస్త్ ఫణి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్ ముత్యాల, ఆర్ట్: రాజీవ్ నాయర్, రచన, దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ (మను), నిర్మాతలు: రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్., సహ నిర్మాత: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: సంతోష్.