'మా' ప్రమాణోత్సవంలో హేమను అవమానించిన నరేశ్!
- IndiaGlitz, [Friday,March 22 2019]
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా గెలిచిన సీనియర్ నటి హేమ సత్తా ఏంటో చాటిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం రోజున జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ఉపాధ్యక్షురాలు హేమకు తీవ్ర అవమానం జరిగింది. ప్రమాణం అనంతరం కార్యక్రమంలో నరేశ్, జీవిత, రాజశేఖర్ ప్రసంగించారు. అప్పటికే నరేశ్ వర్సెస్ రాజశేఖర్‌గా వాతావరణం నెలకొంది. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడేందుకు హేమ మైక్ తీసుకున్నారు.
ఆమె ‘మా’కు సంబంధించిన పలు విషయాలపై మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకున్న నరేశ్.. హేమ మైక్ లాగేశారు. దీంతో స్టేజ్‌పై ఉన్న పెద్దలు, సభికులుంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే హేమ మాట్లాడుతున్నప్పటికీ నరేశ్ మైక్ లాక్కుని వెళ్లిపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సాటి మహిళకు అన్యాయం జరుగుతోందని భావించారో ఏమోగానీ జీవిత రంగంలోకి దిగి.. జీవిత, మరోవైపు రాజశేఖర్ ఆమెకు మైక్ అందించారు. దీంతో ప్రమాణోత్సవంలో అసలేం జరుగుతోంది..? ప్రమాణం రోజే నరేశ్ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు..? ఇప్పుడే ఇలా ఉంటే మున్ముంథు పరిస్థితులు ఎలా ఉంటాయో..? అంటూ ముక్కున వేలేసుకున్నారు.
హేమ ఏమన్నారంటే..
నరేశ్ ప్రకటించిన అంశలన్నీ ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలే. మమ్మల్ని ఇంతరవరకు సంప్రదించలేదు.. కనీసం మీటింగ్‌లో కూడా చెప్పలేదు. మమ్మల్ని కలుపుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా మందిలో ఈ అసంతృప్తి ఉంది. వారందరి తరుపున నేను మాట్లాడుతున్నా. మా కార్యవర్గంలో 26మంది సభ్యులు ఒక్కటే. అంతా కలసి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన చేయండి. సారీ నరేశ్ మీరిలా చేయడం నాకు నచ్చలేదు అని హేమ తన ప్రసంగాన్ని తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ముగించారు.