వారణాసిలో నరేంద్ర మోదీ నామినేషన్.. బలప్రదర్శన!
- IndiaGlitz, [Friday,April 26 2019]
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్డీయే పక్షాల నేతలు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రాంవిలాశ్ పాశ్వాన్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మోదీ నామినేషన్ సందర్భంగా ఎన్డీయే పక్షాలన్నీ ఒక్కచోట చేరి తమ బలాన్ని ప్రదర్శించారన్న మాట.
కాగా గత ఎన్నికల్లో కూడా మోదీ ఇక్కడ్నుంచే పోటీ చేసి 3,71,784 ఓట్ల మెజార్టీతో విజయదుందుభి మోగించారు. మరోసారి ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్, ఎస్పీ తరఫున షాలిని యాదవ్ బరిలోకి దిగుతున్నారు.
భారీ ర్యాలీతో..
నామినేషన్ వేయడానికి ముందు రోజు అనగా గురువారం నాడు కాశీలో మోదీ భారీ ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. కాగా శుక్రవారం కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి మోదీ నామినేషన్ వేశారు. మోదీ నామినేషన్ కార్యక్రామానికి ఎన్డీయే పక్షాల నేతలతో పాటు బీజేపీ చీఫ్ అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం సర్వానంద సోనేవాల్, హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయెల్, హేమామాలిని, జయప్రద, మనోజ్ తివారి, రవి కిషన్ సహా పలువురు కీలక నేతలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇదిలా ఉంటే నామినేషన్‌కు ముందు అంతకుముందు హోటల్ డిప్యారిస్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అనంతరం కాలభైరవుడి ఆలయలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు.