Narendra Modi:కేసీఆర్ నన్ను కలిశారు.. నా కళ్లలోకి చూసే ధైర్యం లేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఎన్నికల వేళ తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ.. జనగర్జన సభలో ప్రసంగిస్తూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత కేసీఆర్ తనను కలిశారని తెలిపారు. ఎన్డీఏలో చేర్చుకోవాల్సిందిగా తనను కోరారన్నారు. తన కొడుకు కేటీఆర్‌ని ఆశీర్వదించాలని కోరగా.. ఇది ఏం రాజరికం కాదని చెప్పానన్నారు. ప్రజా బలం ఉన్న వ్యక్తే నాయకుడు అవుతారని కేసీఆర్‌కు చెప్పినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి ఇంతవరకు కేసీఆర్ తనను కలవలేదని.. నా కళ్లలోకి చూసే ధైర్యం కేసీఆర్‌కు లేదని మోదీ వ్యాఖ్యానించారు.
తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది..
ఎంతో మంది బలిదానాలతో సాకారమైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాస్త కుటుంబస్వామ్యంగా మారిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబసభ్యులు మాత్రమే బాగపడ్డారని పేర్కొ్న్నారు. కుటుంబ పాలనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని యువతకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వం అని తెలిపారు. బీబీ నగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనం పనులు చాలా తొందరగా పూర్తవుతున్నాయని.. ప్రజలంతా తాము చేసిన మంచి పనులను గమనిస్తున్నారని మోదీ వివరించారు. తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ ధ్యేయమని ఆయన తెలిపారు.
రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు తెలంగాణలో పర్యటించిన మోదీ..
కాగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ రూ.8వేల కోట్ల విలువలైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను మోదీ జాతికి అంకితం చేశారు. అలాగే మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్.. సిద్దిపేట-సికింద్రాబాద్ రైలును ప్రారంభించారు. రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు మోదీ తెలంగాణ పర్యటన చేయడంపై రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆదివారం మహబూబ్ నగర్ పర్యటనకు వచ్చిన మోదీ పలు వరాలు కురిపించారు. రాష్ట్ర రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల వార్ మొదలైనట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments