కీలక ప్రకటనతో కొట్లాట పెట్టిన మోదీ..!
- IndiaGlitz, [Tuesday,January 08 2019]
అగ్ర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ లెక్క ప్రకారం ఇప్పటి వరకూ 50 శాతం రిజర్వేషన్ కాస్త 60 శాతానికి చేరుతుందన్న మాట. ఈ ప్రకటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం మేరకు వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు.. వ్యవసాయ భూమి ఐదు ఎకరాలు ఉన్నవారికి మాత్రమే ఈ కోటా వర్తించనుంది.మోదీ సర్కార్ ప్రకటనను కొందరు స్వాగతిస్తున్నప్పటికీ ఎక్కువ శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ భిన్నాభిప్రాయాల వెలువడుతున్న నేపథ్యంలో ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్‌కు రాబోతోంది. అయితే పాసవుతుందా..? అట్టర్ ప్లాప్ అవుతుందా? అనేది మంగళవారం నాడు తెలియనుంది.
కాగా.. మోదీ సర్కార్ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లు సైలెంట్‌గా ఉన్న మోదీ.. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇలా హడావుడి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు, పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ అబద్ధాలతోనే గడిపేసిన బీజేపీ సర్కార్.. తాజా ప్రకటనతో నిండా మునగడమే తప్ప ఏ మాత్రం ప్రయోజనం చేకూరదంటూ ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ వ్యాఖ్యానించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రిజర్వేషన్ ప్రకటనతో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద ఎత్తున కొట్లాటే జరుగుతోందని చెప్పుకోవచ్చు.
ఈ రెండు ప్రకటనలే కీలకం కానున్నాయా..!?
ఎలాగైనా సరే మళ్లీ ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న మోదీ.. జన్‌ధన్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్‌లో ఐదు నుంచి పది లక్షలు జమ చేయాలని భావించారని.. దీంతో తనకు ఎక్కడ ఎసరొచ్చి పడుతుందో అని ముందే అలెర్టయిన ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా చేసి బయటికెళ్లిపోయారనే టాక్ నడుస్తోంది. తాజాగా రిజర్వేషన్ల పెంపు వ్యవహారం ఈ రెండింటితోనే దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుని మళ్లీ ఓట్లన్నీ ఎన్డీఏకే పడేలా మోదీ-షా ద్వయం వ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ రెండు ప్రకటనలు.. ఎంత వరకు ఆచరణలోకి వస్తాయి..? మోదీకి ఏ మేరకు సీట్లు సంపాదించి పెడతాయో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.