నిజ ఘటన ఆధారంగానే 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్' సినిమా చేశాను - నరసింహ నంది

  • IndiaGlitz, [Tuesday,August 01 2017]

'1940లో ఓ గ్రామం', 'హైస్కూల్‌', 'కమలతో నా ప్రయాణం', 'లజ్జ' వంటి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు చేస్తూ మంచి అభిరుచి వున్న దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు నరసింహ నంది. తాజాగా 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌' పేరుతో మరో భిన్నమైన సినిమాని రూపొందించారు. లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నరసింహ నంది మిత్రులు నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌ 4న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు నరసింహ నందితో జరిపిన ఇంటర్వ్యూ..
క‌థేంటి?
ఒక విలేజ్‌లో జరిగే కథ. గేదె ఒక ఫ్యామిలీని పోషిస్తుంటుంది. ఆ గేదె చనిపోతే ఆ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది మెయిన్‌ కాన్సెప్ట్‌. ఇరానియన్‌ మూవీ 'ది కౌ' ఈ సినిమాకి ఇన్‌స్పిరేషన్‌. దరుషి మెహర్జాన్‌ ఆ సినిమాకి దర్శకుడు. ఒక జంతువుకి, మనిషికి వున్న రిలేషన్‌ ఎలాంటిది అనేది ఆ సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఎఫెక్షన్‌ వుంటుందనే ఆ సినిమాలో చూపించారు. ఆ తర్వాత 'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌' సినిమా చెయ్యడానికి మెయిన్‌ రీజన్‌ నేను కళ్ళారా చూసిన ఓ యాక్సిడెంట్‌. ఆ ఊరికి వెళ్తున్నప్పుడు నలుగురు కుర్రాళ్ళు కారుని ర్యాష్‌గా డ్రైవ్‌ చేస్తూ ఓ గేదెను కొట్టేసి వెళ్ళిపోయారు. కనీసం కారు కూడా ఆపకుండా వెళ్ళిపోయారు. ఆ గేదె చనిపోయింది. ఆ గేదె తాలూకు మనిషి వచ్చి బాధపడుతూ వుంటే వెంటనే వెళ్ళి పోలీస్‌ కేస్‌ పెట్టండి అని చెప్పి వచ్చేశాను. ఒక జంతువు తమ కారు కిందే పడి చనిపోతే ఎలాంటి బాధ, బాధ్యత లేకుండా వెళ్ళిపోయారు. దానికి ఏదో ఒక నష్టపరిహారం ఇస్తే బాగుండేది అనిపించింది. కొడుకులా తమ కుటుంబాన్ని పోషిస్తున్న గేదె చనిపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? ఈ ఆలోచన వచ్చిన తర్వాత దీనిమీద ఒక సినిమా చేద్దాం అనిపించింది. దీనికి సంబంధించిన కథ రెడీ చేసుకొని కొన్ని కమర్షియల్‌ హంగులు కూడా అద్ది ఆ రైతు తనకు జరిగిన నష్టానికి ఎలాంటి పోరాటం చేశాడు? ఎలా నెగ్గాడు? కోర్టు ఎలాంటి జడ్జిమెంట్‌ ఇచ్చింది అనేది కథ.
ఈ కథని కొత్తవాళ్ళతోనే చెయ్యడానికి రీజన్‌?
కొత్తవాళ్ళతో చేస్తేనే ఈ కథకు న్యాయం జరుగుతుందనిపించింది. పాతవారైతే ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోవాలంటే కొంచెం కష్టంగానే వుంటుంది. నేను క్రియేట్‌ చేసుకున్న క్యారెక్టర్స్‌ అన్నీ చాలా నేచురల్‌గా వుంటాయి. విలేజ్‌లో ఎలా వుంటారో అలాగే బిహేవ్‌ చేస్తారు.
మీ గత చిత్రాలు కమర్షియల్‌గా సక్సెస్‌ అవ్వలేదు. ఈ సినిమాకి కమర్షియల్‌గా ఎలాంటి ఫలితం వస్తుందనుకుంటున్నారు?
ఈ కథని కొంచెం కమర్షియలైజ్‌ చేశాను. ఇందులో లాయర్‌ క్యారెక్టర్‌ వుంటుంది. అతనికి ఓ లవ్‌స్టోరీ వుంది. తన గేదె చనిపోయిందని, తనకు న్యాయం చెయ్యాలని గేదె యజమాని ఫైట్‌ చేస్తుంటాడు. దీన్ని కమర్షియల్‌ యాంగిల్‌లోనే తియ్యడం జరిగింది. అతనికి ఎలాగైనా న్యాయం జరగాలని ఒక టి.వి. రిపోర్టర్‌ పోరాడుతూ వుంటాడు. ఆ ఛానల్‌ కూడా అతనికి సపోర్ట్‌ చేస్తుంది. ఒక పక్క మీడియా, ఒక పక్క రిపోర్టర్‌, మరో పక్క టి.వి. ఛానల్‌.. ఇలా మూడు యాంగిల్స్‌లో కమర్షియల్‌గానే చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను చేసిన సినిమాలు స్లో నేరేషన్‌లో వుంటాయి. అందులో మూడు, నాలుగు క్యారెక్టర్స్‌తోనే కథ రన్‌ అవుతూ వుంటుంది. ఈ సినిమా మాత్రం ఫాస్ట్‌గా వుంటుంది. క్యారెక్టర్స్‌ కూడా ఎక్కువగా వుంటాయి. ఎక్కువ క్రౌడ్‌తో చేసిన సినిమా.
ఇందులో పాటలెలా వుంటాయి?
రెండు పాటలున్నాయి. ఒకటి రాజమండ్రిలో తీశాం. మరొకటి సిట్యుయేషనల్‌ సాంగ్‌. మీడియా మీద రాసిన పాట అది. చల్లా భాగ్యలక్ష్మీగారు ఈ పాటను చాలా అద్భుతంగా రాశారు. ఈ పాటకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.
'బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్‌ న్యూస్‌' అనే టైటిల్‌ పెట్టడానికి కారణం?
ఈ సినిమా అంతా బుడ్డారెడ్డిపల్లి అనే గ్రామంలోనే చేశాం. ఆ గ్రామం నుంచి వెళ్ళినవారంతా చాలా గొప్పవాళ్ళయ్యారని చెబుతారు. ఆ ఊరికి 200 సంవత్సరాల చరిత్ర వుంది. ఆ ఊళ్ళో వున్న బావి నీరు తాగడం వల్ల అక్కడ పుట్టి పెరిగిన వారంతా మేధావులైపోయారు అని చెప్పుకుంటారు. ఆ చుట్టుపక్కలంతా ఫ్లోరైడ్‌ వాటరే వుంది. ఆ ఒక్క బావిలోనే మంచి నీళ్ళు వుంటాయి. అంతేకాకుండా బుడ్డారెడ్డిపల్లి అనే పేరు కూడా డిఫరెంట్‌గా వుండాలని ఆ టైటిల్‌ పెట్టడం జరిగింది.
మీ సినిమాలన్నీ లో బడ్జెట్‌లోనే వుంటాయి కదా. ఈ సినిమాని కూడా అలాగే తీశారా?
నేను ఇప్పటివరకు చేసిన సినిమాలకంటే ఈ సినిమాకి బడ్జెట్‌ కాస్త ఎక్కువే అయింది. ఎందుకంటే ఎక్కువమంది ఆర్టిస్టులు వుంటారు, ఎక్కువ క్రౌడ్‌ వుంటుంది. మొత్తం 35 రోజులు షూటింగ్‌ చేశాం. అలాగే సినిమాలో చాలా సీన్స్‌ సి.జి. చెయ్యాల్సి వచ్చింది. అందుకే బడ్జెట్‌ కూడా పెరిగింది.
మీ త‌దుప‌రి చిత్రాలు
తెలుగు భాష గురించి ఒక సినిమా చేస్తున్నాం. ఇప్పటికి 75 శాతం షూటింగ్‌ పూర్తయింది. 'ఉత్పలమాల ఉత్తరం రాసింది' ఆ సినిమా టైటిల్‌. చాలా మంచి సబ్జెక్ట్‌. కొన్ని తెలుగు పదాలు మనుషుల రూపంలో వస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న భాషను చూస్తే వాళ్ళు ఎలా ఫీల్‌ అవుతారు అనేది కథ. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.