Balakrishna:చిటికెస్తే చాలు.. బాలయ్య వార్నింగ్, నా ఏరియాలో నీకెం పనంటూ వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దేవాంగ కమ్యూనిటీపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీనిపై బాలయ్య క్షమాపణలు చెప్పారు కూడా. ఆ తర్వాత కొద్దిరోజులకే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో మహానటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపాయి. ఈ వివాదం సద్దుమణగకముందే.. అన్‌స్టాపబుల్ షోలో నర్సులను ఉద్దేశిస్తూ అన్న మాటలపై నర్సుల సంఘం భగ్గుమంది. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని, ఆ మాటలను వెనక్కి తీసుకుకోవాలని ఆంధ్రప్రదేశ్ నర్సుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. తాజాగా బాలయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఏపీలోని అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే:
పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కోటప్పకొండ తిరునాళ్ల కోసం ప్రభను రూపొందించారు స్థానికులు. అనంతరం ఈ ప్రభ వద్ద డ్యాన్స్‌లు చేశారు. ఈ సందర్భంగా సినీ హీరో నందమూరి బాలకృష్ణ పాటలు పెట్టడం కలకలం రేపింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఓ కార్యకర్త బాలయ్య పాటకు డ్యాన్స్ చేయడంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అతనిని మందలించారు. దీనిపై మనస్తాపానికి గురైన సదరు యువకుడు ఎమ్మెల్యే ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడే వున్న పోలీసులు, వైసీపీ కార్యకర్తలు అతనిని అడ్డుకున్నాయి.
మూడోకన్ను తెరిస్తే అంటూ బాలయ్య వార్నింగ్ :
ఈ విషయం బాలకృష్ణ దాకా వెళ్లడంతో ఆయన స్పందించారు. రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టొద్దని..సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు వుంటారని, మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఆ ఎమ్మెల్యే తన స్థాయిని దిగజార్చుకున్నాడని.. అంతకంటే మూర్ఖుడు ఎవరైనా వుంటారా అని బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక చిటిక వేస్తే చాలు.. ఒకసారి మూడో కన్ను తెరిస్తే జాగ్రత్త అంటూ ఆయన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరించారు.
తాగుబోతులను వెనకేసుకుని రావొద్దన్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి:
దీనికి గోపిరెడ్డి అదే స్థాయిలో కౌంటరిచ్చారు. అసలు నా నియోజకవర్గం సంగతి నీకెందుకంటూ మండిపడ్డారు. తాగుబోతులను వెనకేసుకొచ్చి మీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోవద్దని ఎమ్మెల్యే హితవు పలికారు. ఏదైనా మాట్లాడేముందు అన్ని విషయాలు తెలుసుకోవాలని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయినా మీరెవరు నాకు వార్నింగ్ ఇవ్వడానికి అంటూ బాలయ్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై నటసింహం స్పందిస్తారో లేక ఇక్కడితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com