నారా రోహిత్ బాగా చేయలేకపోయాడు అనిపించినా ఫరవాలేదు కానీ...! - నారా రోహిత్..!
- IndiaGlitz, [Wednesday,January 04 2017]
విభిన్న కథా చిత్రాలు చేస్తూ... ఫుల్ బిజీగా ఉన్న యువ హీరో నారా రోహిత్. 2016లో ఓ నాలుగైదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నారా రోహిత్ ఏడాది చివరిలో అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని తన ఫ్రెండ్స్ కృష్ణ విజయ్, ప్రశాంతిలతో కలిసి నారా రోహిత్ నిర్మించాడు. సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రొటీన్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్రం విశేష ప్రేక్షకాదరణతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా నారా రోహిత్ తో ఇంటర్ వ్యూ మీకోసం...!
అప్పట్లో ఒకడుండేవాడు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది... ఎలా ఫీలవుతున్నారు..?
నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుంది అనుకున్నాను కానీ ఇంత రెస్పాన్స్ వస్తుంది అని అసలు అనుకోలేదు. మేము కంటెంట్ నమ్ముకున్నాం. డైరెక్టర్ సాగర్ చంద్ర స్ర్కిప్ట్ పై క్లారిటితో ఉన్నారు. నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా సక్సెస్ కావడం ఇంకా ఆనందంగా ఉంది.
మీ పాత్ర నిడివి తక్కువ ఉంది కదా..! అయినా సరే ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం..?
నేను నా పాత్ర నిడివి తక్కువ ఉందా..? వేరే వాళ్ల క్యారెక్టర్ నిడివి ఎక్కువ ఉందా..? అనేది ఆలోచించను. నాకు కథ నచ్చాలి. కథ బాగుంటే..సినిమా ఆడుతుంది అనేది నమ్ముతాను. అందుచేత నా పాత్ర నిడివి గురించి పట్టించుకోలేదు.
ఈ సినిమాలో మీ పక్కన్ హీరోయిన్ ని పెట్టలేదు ఎందుకని..?
హీరోయిన్ లేకపోతే ఇలా ఎందుకు చేసారు అని అందరూ అడుగుతారు అనుకున్నాను. దీని గురించి ఓ మూడు నెలలు షూటింగ్ ఆలస్యం అయ్యింది. కథ ప్రకారం అలా ఉంటేనే బాగుంటుంది అనిపించింది.
ఈ సినిమా రిలీజ్ బాగా ఆలస్యం అయినట్టుంది..?
అవునండి..! జూన్ లోనే షూటింగ్ పూర్తయ్యింది. ఆ టైమ్ లో జ్యోఅచ్యుతానంద సినిమా ఉండడంతో ఈ సినిమాని వాయిదా వేసాం. నవంబర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నాం. నోట్ల రద్దు వలన వాయిదా వేసాం. ఫైనల్ గా డిసెంబర్ 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసాం.
సంక్రాంతికి భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందువలన మీ సినిమా ధియేటర్స్ నుంచి తీసేసే అవకాశం ఉంది. అందుచేత రాంగ్ టైమ్ లో సినిమాని రిలీజ్ చేసాం అనుకుంటున్నారా..?
సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తే గ్యారెంటీగా ఆడుతుందో చెప్పలేం. ఎందుకంటే ఎలాంటి సినిమాల పోటీ లేనప్పుడు నా సినిమాలు రిలీజ్ చేసాం. కానీ...ఆడలేదు. అందుచేత ఇది కరెక్ట్ టైమ్ అని చెప్పలేం. మేము ఊహించిన దాని కంటే ఎక్కువ స్పందన వస్తుంది. సో...హ్యాపీ..!
శ్రీవిష్ణు కోసమే ఈ సినిమా తీసినట్టుంది అంటే మీరేమంటారు..?
ఈ సినిమా వలన ఇద్దరికీ మంచి పేరు వచ్చింది. నేను హీరోగా కెరీర్ ప్రారంభించినప్పుటి నుంచి కలిసి జర్నీ చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ కి విష్ణు కరెక్ట్ గా సెట్ అవుతాడు అనిపించింది. అందుకే శ్రీవిష్ణుని అనుకున్నాం. ప్రతినిధి సినిమా శ్రీవిష్ణు చేయాలి. తనకు ఆఫర్ వస్తే నేను సెట్ అవుతాను అని ఆ క్యారెక్టర్ నాతో చేయించాడు.
ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా..?
ఈ కథని సీరియల్స్ లా తీయచ్చు. అయినా అంత పెద్ద కథని రెండు గంటల్లో చెప్పడం గొప్ప విషయం అని నా ఫీలింగ్.
2016 సంవత్సరం ఎలా గడిచింది..?
ఎగ్జైట్ మెంట్, మిస్ టేక్స్, హ్యాపీ...ఇలా అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా నా తప్పులు ఏమిటో తెలుసుకున్నాను. 2017లో తీసుకున్న నిర్ణయం ఏమిటంటే...ఒక సినిమా రిలీజ్ తర్వాతే వేరే సినిమా ఏమటి అనేది ఎనౌన్స్ చేస్తాను. ఇంతకు ముందులా వరుసగా సినిమాలు రిలీజ్ చేయకూడదు అని నిర్ణయించుకున్నాను.
మీ సినిమాలు ఎలా ఉండాలి అనుకుంటారు..?
నారా రోహిత్ బాగా చేయలేకపోయాడు అనిపించినా ఫరవాలేదు కానీ...సినిమా బాగుండాలి అనుకుంటాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
కథలో రాజకుమారి సినిమా చేస్తున్నాను. 80% సినిమా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత పవన్ మల్లెల దర్శకత్వంలో ఓ కమర్షియల్ మూవీ చేస్తున్నాను. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను.