ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన నారా లోకేష్
- IndiaGlitz, [Friday,May 17 2019]
మే-23న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ క్రమంలో అటు వైసీపీ కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఇటు టీడీపీ మాత్రం మరోసారి అధికారం దక్కించుకోబోతోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ తరుణంలో మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో గెలుపెవరిదో తేల్చేశారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో జహపన షోరూమ్ ప్రారంభోత్సవంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు.
ఏపీకి మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి కాబోతున్నారని.. సంపూర్ణ మెజారిటీతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని నారా లోకేష్ తేల్చిచెప్పారు. చంద్రగిరి రీ పోలింగ్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. 40 రోజుల తర్వాత రీ పోలింగ్ పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. ఈసీ విడుదల చేస్తానంటున్న వీడియోలు నిజమో కాదో చూడాలి..? అని ఆయన తెలిపారు.మేం రీ పోలింగ్ కోసం కోరినా ఈసీ పట్టించుకోలేదన్నారు. ఏపీలో గత ఎన్నికల కంటే పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలవబోతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ‘మోదీ కమిషన్ ఆఫ్ ఇండియా’ మాదిరి ఎలక్షన్ కమిషన్ మారిపోయిందన్నారు. పశ్చిమ బెంగాల్లో ఒకరోజు ముందే ప్రచారం ఆపిన వ్యవహారంపై మాట్లాడిన ఆయన.. దేశ చరిత్రలోఎప్పుడూ జరగలేదన్నారు. టీవీ శేషన్ ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు తెస్తే.. ఇపుడు ఎలక్షన్ కమిషన్ వాటికి ఉల్టా పద్దతిలో వెళ్తోందన్నారు. ఈసీ మీద మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా లోకేశ్ చెప్పుకొచ్చారు.