Napoleon Review
మధ్య తరగతి మానవుడికి నిద్ర లేచినప్పటి నుంచి సవాలక్ష ప్రశ్నలు. తన గురించి తనకే కాదు, ఇరుగుపొరుగు గురించి, తాను ఉంటున్న సమాజం గురించి సవాలక్ష సందేహాలు. కానీ దేనిమీదా దృష్టిపెట్టే తీరిక మాత్రం ఉండదు. అందుకే ఆలోచనలన్నీ మనసులోనే నిగూఢంగా దాగిపోతుంటాయి. కానీ అలాంటి విషయాలను ప్రశ్నించిన చిత్రం `ప్రతినిధి`. నాకు రావాల్సిన చిల్లర వస్తే చాలు.. అని పెట్రోల్ బంక్‌లోచిల్లర గురించి బాహాటంగా ప్రశ్నించిన చిత్రమది. ఆ సినిమాకు రచయిత ఆనంద్ రవి. ఆయన తాజాగా నటిస్తూ, రచన, దర్శకత్వం చేసిన సినిమా `నెపోలియన్`. నా నీడ పోయింది సార్ అనే ట్యాగ్‌లైన్‌తో పోస్టర్లతోనూ, టీజర్, ట్రైలర్లతోనూ ఆకట్టుకున్నారు. ఈ సారి ఆనంద్ రవి లేవనెత్తిన అంశాలేంటి? దర్శకుడిగా ఆయన తొలి ప్రయత్నం సక్సెస్ అయిందా? నటుడిగా మంచి మార్కులే తెచ్చుకుంటాడా? రివ్యూ చూసేయండి..
కథ:
తన నీడపోయిందని కంప్లయింట్ ఇస్తాడు నెపోలియన్ (ఆనంద్ రవి). అతని కేసు విని పోలీస్ ఆఫీసర్ (రవివర్మ)కి మతి పోతుంది. రకరకాల పరీక్షలు చేశాక నిజంగానే నెపోలియన్ కి నీడ లేదని అర్థం చేసుకుంటారు. దేవుడు కల్లోకి వచ్చి చెప్తే తనకు తొలిసారి ఆ విషయం తెలిసిందని చెప్తాడు నెపోలియన్. అప్పటి నుంచి రోజుకోసారి నెపోలియన్‌కి దేవుడు కల్లోకి వస్తుంటాడు. వీధుల్లో అక్రమంగా వేసిన స్పీడ్ బ్రేకర్ల వల్లే సగం మందికి నడుం నొప్పులు వస్తున్నాయని, నడుం నొప్పి వచ్చినవారు ఆసుపత్రుల చుట్టూ తిరగడం మానేసి, జీహెచ్ ఎంసీ చుట్టూ తిరగాలని చెప్పాడనీ అంటాడు. మరుసటి రోజు కలలో దేవుడు ఓ యాక్సిడెంట్ కేసును గురించి చెప్పాడని చెప్తాడు. అది యాక్సిడెంట్ కాదనీ, మర్డర్ అని చెప్పినట్టు వివరిస్తాడు. దాంతో పోలీస్ స్టేషన్‌లో మూతపడ్డ యాక్సిడెంట్ కేసు మరలా మొదలవుతుంది. ఇదంతా చూసిన నెపోలియన్ భార్య (కోమలి) పోలీస్ స్టేషన్‌కి చేరుకుంటుంది. నెపోలియన్ అసలు పేరు అశోక్ అనీ, తన భర్త అనీ అంటుంది. ఒకానొక సందర్భంలో నెపోలియన్ తనను తాను తిరుపతిగా పరిచయం చేసుకుంటాడు. తన ఫ్యామిలీని కాపాడమని పోలీసులను వేడుకుంటాడు. అసలు నెపోలియన్ ఎవరు? తిరుపతి ఫ్యామిలీకి వచ్చిన కష్టం ఏంటి? యాక్సిడెంట్ జరిగింది ఎవరికి? దాన్ని ఓపెన్ చేయమని దేవుడు ఎందుకు కల్లో చెప్పాడు? నెపోలియన్ నిజంగా అశోక్ అయితే.. అసలు అలా ఎందుకు నటించాల్సి వచ్చింది? వంటి పలు ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా క్లైమాక్స్.
ప్లస్ పాయింట్లు:
* కథ కొత్తగా ఉంది
* సమాజం పట్ల ఆలోచనను రేకెత్తిస్తుంది
* కొన్ని డైలాగులు ఆలోచింపజేస్తాయి
* నటీనటులు తమ పరిధి మేరకు నటించారు
* దర్శకుడిగా ఆనంద్ రవి పాస్
మైనస్ పాయింట్లు:
* కన్‌ఫ్యూజింగ్‌గా ఉండే క్లైమాక్స్
* ఎడిటింగ్ కత్తెరకు పదును తగ్గడం
* స్క్రీన్ ప్లే కాస్త గందరగోళంగా ఉండటం
* కన్విన్స్ చేయలేని పాయింట్లు
విశ్లేషణ:
నిత్యం బిజీగా రోడ్ల మీద సొంత పనులతో జనాలు ఉరుకులు పరుగులు తీస్తుంటారు. పక్కవాడు రక్తపుమడుగులో ఉన్నా క్షణం ఆగి సాయం చేయాలనే ఆలోచనకు దూరంగా సగటు మనిషి ఎప్పుడో ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అదే ఒక్క క్షణం ఆగితే ఒక నిండు ప్రాణాన్ని కాపాడవచ్చు. ఆ ప్రాణం కోసం ఎదురుచూసే కుటుంబాన్ని వీధిన పడకుండా చూడవచ్చు. ఈ కాన్సెప్ట్ నిజంగా అందరినీ ఆలోచింపజేసేది. స్వార్థం కోసం రోడ్లమీద అడ్డంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల యువతరం నడ్డి విరుగుతోందన్న విషయన్ని కూడా దర్శకుడు సెన్సిటివ్‌గా చెప్పాడు. పాయింట్‌గా దర్శకుడు అనుకున్న కథ మాత్రం నిస్సందేహంగా బలమైందే. అంత బలమైన పాయింట్ చుట్టూ అల్లుకున్న సన్నివేశాలే కొన్ని సార్లు కన్విన్సింగ్‌గా అనిపించవు. సినిమా సాగుతున్న కొద్దీ దర్శకత్వం అనే గ్రాఫ్ పడుతూ, లేస్తూ కనిపిస్తుంది. అప్పటికప్పుడు కథలో మాంచి పట్టు ఉంది అనుకుంటుండగానే ఒక్కసారిగా ప్రేక్షకుడి అంచనాలను తారుమారు చేసే సీన్‌లు కమ్మేస్తాయి.
నీడపోవడం అనే కాన్సెప్ట్ పబ్లిసిటీకి చాలా బాగా పనికొచ్చింది. కానీ సినిమాలో ఆ విషయం ఎంతవరకు కథాగమనానికి తోడ్పడింది అనేది ఆలోచించాల్సిన విషయం. తన నీడను అనుకున్నప్పుడు తెచ్చుకుని, వద్దనుకున్నప్పుడు పారదోలగల శక్తి ఉన్న ఆత్మకు, తనను చంపిన వారు ఎందుకు చంపారో అర్థం కాదా? పిడిగుద్దుతో అవతలి వ్యక్తిని మట్టికరిపించగల సత్తా ఉన్న ఆత్మకు తన వారు ఎక్కుడున్నారో.. తన వెనుక ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి ఉండదా? ఒక వేళ ఆత్మ అశోక్‌లో ప్రవేశించడమే నిజం అయితే, నెపోలియన్ అనే పేరు ఎందుకు? ఎంత నమ్మశక్యంగా ఉంటే మాత్రం పోలీసులు ఓ వ్యక్తి చెప్పే కలలను ఆధారంగా చేసుకుని, అతను ఇచ్చే క్లూల కోసం పడిగాపులు కాస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఈ సినిమా చూస్తే కోకొల్లలు కలుగుతాయి. అయితే ఈ చిత్రాన్ని చూడాల్సిన యాంగిల్ మాత్రం అది కాదు. సమాజంలో నిత్యం ప్రమాదాలుగా చిత్రీకరించబడుతున్న ఎన్నో విషయాల వెనుక ఊహలకు అందని మిస్టరీ దాగి ఉందని. కలిసి బతకాల్సిన ప్రపంచంలో, స్వార్థం కోసం సాటి మనిషిని నిండా ముంచేయడానికి కూడా కొందరు వెనకాడటం లేదని!
బాటమ్ లైన్: సమాజాన్ని ప్రశ్నించే `నెపోలియన్`
Napoleon Movie Review in English
- Read in English