డిసెంబర్ 16న 'నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్' విడుదల
- IndiaGlitz, [Friday,December 02 2016]
తండ్రీ కూతుళ్ల మధ్య స్వచ్ఛమైన అనుబంధాన్ని చెప్పిన చిత్రాలన్నీ ఇప్పటిదాకా బాక్సాఫీసును దర్జాగా కొల్లగొట్టినవే. ఆ కోవలోకి చేరడానికి ముస్తాబవుతోన్న తాజా చిత్రం 'నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్'. ఈ నెల 16న విడుదల కానుంది. లక్కీ మీడియా నిర్మిస్తున్న చిత్రమిది. బెక్కం వేణుగోపాల్ (గోపి) నిర్మాత. భాస్కర్ బండి దర్శకత్వం వహించారు. మానస, మహాలక్ష్మి ఈ చిత్రానికి సమర్పకులు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మడివాడ, అశ్విన్ బాబు, పార్వతీశం, నోయల్ సేన్ కీలక పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుదిదశలో ఉన్నాయి.
చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్ (గోపి) మాట్లాడుతూ ''తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పే చిత్రమిది. వయసులో ఉన్న అమ్మాయి 'నాన్న - నేను - నా బాయ్ ఫ్రెండ్స్' అని ఎందుకు అన్నది? అనేది మా చిత్రంలో ఆసక్తికరమైన అంశం. షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. శేఖర్ చంద్ర చాలా మంచి బాణీలిచ్చారు. పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. ఈ వారం పాటల్ని విడుదల చేస్తాం. ఆడియో సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. ఆ మధ్య మేం విడుదల చేసిన టీజర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. డిసెంబర్ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. దిల్‌రాజుగారికి మా సినిమా చాలా బాగా నచ్చింది. ఆయనే విడుదల చేస్తున్నారు'' అని తెలిపారు.
కృష్ణభగవాన్, సన, తోటపల్లి మధు, ధన్ రాజ్, జబర్దస్త్ షకలక శంకర్, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమరా: చోటా.కె.నాయుడు, సంగీతం: శేఖర్ చంద్ర, ఆర్ట్: విఠల్ కోసనమ్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్క్రీన్లప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, కథ: బి.సాయికృష్ణ, పాటలు: చంద్రబోస్, భాస్కర్ భట్ల, వరికుప్పల యాదగిరి, కాసర్ల శ్యామ్, నృత్యాలు: విజయ్ ప్రకాశ్, స్టంట్స్: వెంకట్.