ఈ ఏడాది నాని కంటిన్యూ చేయ‌డం లేదా?

  • IndiaGlitz, [Thursday,April 26 2018]

హ్యాట్రిక్ హిట్స్‌ అందుకోవడమే అరుదైపోయిన‌ ఈ రోజుల్లో.. ఏకంగా డబుల్ హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు నేచురల్ స్టార్ నాని. అంతేగాకుండా.. వరుసగా ఎనిమిది హిట్ చిత్రాలను ప్రేక్షకులకి అందించారు ఈ యువ క‌థానాయ‌కుడు.

ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చిన నాని తాజా చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. దీంతో.. నాని వ‌రుస విజ‌యాల‌కి బ్రేక్ ప‌డిన‌ట్ల‌య్యింది. ఈ ప‌రాజ‌యంతో.. నాని ఆలోచన‌లో ప‌డ్డార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌.  గత మూడు సంవత్సరాలుగా అంటే.. 2015 నుంచి ప్రతీ ఏటా మూడు సినిమాలను ప్లాన్ చేసుకునేవారు నాని. కాని ఈ ఏడాది ఇప్పటికే 'కృష్ణార్జున యుద్ధం' విడుదల కాగా.. ప్ర‌స్తుతం నాగార్జునతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఈ ఏడాది ఆగష్టు కల్లా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

అంటే.. నాని ఈ ఏడాది రెండు సినిమాల‌తోనే స‌రిపెట్టే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌. సాధారణంగా ఒక మూవీ సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నాని.. ఇంతవరకు మరే సినిమాకు ఓకే చెప్పకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే.. ‘కృష్ణార్జున యుద్ధం’ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవడంతో ఇన్నాళ్ళు జోరు చూపించిన ఈ హీరో ..

ఇప్పుడు సినిమాలు, కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టు టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి.. మూడేళ్ళుగా ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేసిన నాని.. ఈ ఏడాది రెండు సినిమాల‌కే ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌న్న‌మాట‌.