మజ్నులో అలా చేయడం నాకు కిక్ ఇచ్చింది - నాని
- IndiaGlitz, [Thursday,September 22 2016]
భలే భలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మన్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో నాని. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ వరుస విజయాలు సాధిస్తున్న నాని తాజా చిత్రం మజ్ను. ఈ చిత్రాన్ని ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాని సరసన అను ఇమ్మాన్యుయల్, ప్రియ నటించారు. వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మజ్ను చిత్రం ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మజ్ను హీరో నానితో ఇంటర్ వ్యూ మీకోసం...
మజ్ను ఎలా ఉంటుంది..?
చాలా కొత్తగా ఉంటుంది. మజ్ను అంటే సీరియస్ గా ఉంటుంది అనుకుంటారు కానీ...మా సినిమా అలా ఉండదు. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉండే టిపికల్ లవ్ స్టోరీ మా మజ్ను.
ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు..ట్రయాంగిల్ లవ్ స్టోరీ నా..?
అందరూ ఇదే అడుగుతున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీనా అంటే...అవును అని చెప్పలేను. అలాగని కాదు అని చెప్పలేను. అది ఏమిటి అనేది నేను చెప్పడం కన్నా తెర పై చూస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్..!
మజ్ను అని టైటిల్ పెట్టారు కదా...నాగార్జున మజ్నుకి ఈ మజ్నుకి పోలికలు ఏమైనా ఉంటాయా..?
ఆ సినిమాకి మా సినిమాకి ఎలాంటి పోలికలు ఉండవు.
డైరెక్టర్ విరించి వర్మ తో వర్క్ చేసారు కదా ఏమనిపించింది..?
విరించి వర్మ చాలా టాలెంటెడ్ డైరెక్టరర్. అలాగే చాలా మంచి వ్యక్తి. కొంత మంది డైరెక్టర్స్ ఇంగ్లీషు సినిమాలు చూసి ఆ కథలను మన నేటివిటీకి తగ్గట్టు మారుస్తుంటారు. కానీ విరించి వర్మ అలా కాదు. అసలు ఇంగ్లీషు సినిమాల గురించే అతనికి తెలియదు. తను ఓ కథ అనుకున్న తర్వాత ఆ కథను తన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులకు అందించాలి అనుకుంటాడు అది నాకు బాగా నచ్చింది. ఖచ్చితంగా ఫ్యూచర్ లో పెద్ద డైరెక్టర్ అవుతాడు.
మీతో నటించిన హీరోయిన్స్ (నివేథా థామస్, అను ఇమ్మాన్యుయల్)ని మీ ఫేవరేట్ హీరో ఎవరు అని అడిగితే నాని అంటూ మీ పేరే చెబుతున్నారు ఏమిటి విషయం..?
సినిమా ప్రమోషన్ కాబట్టి నా పేరు చెబితే బాగుంటుంది అని అలా చెబుతున్నారేమో...(నవ్వుతూ..) నేను షూటింగ్ లో సరదాగా ఉంటాను. సీరియస్ గా ఉండడం నాకు ఇష్టం ఉండదు బహుశా అది నచ్చి నా పేరు చెబుతున్నారేమో..!
ఈ మూవీలో మీరు బాహుబలి అసిస్టెంట్ డైరెక్టర్ గా నటించారు కదా..! అలా నటిస్తున్నప్పుడు మీకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన పాత రోజులు గుర్తుకువచ్చాయా..?
అసిస్టెంట్ డైరెక్టర్ గా నటిస్తున్నప్పుడు ఆరోజులు నిజంగానే గుర్తుకువచ్చాయి. కాకపోతే అప్పుడు నా పరిస్థితులు వేరు. ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్ పరిస్థితులు వేరు. కాకపోతే రియల్ లైఫ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన నేను హీరో అవ్వడం...ఆతర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా క్యారెక్టర్ చేయడం నిజంగా కిక్ నిచ్చింది.
జ్యోఅచ్యుతానంద కథను అవసరాల మీకు చెప్పారా..?
జ్యోఅచ్యుతానందలో హీరోగా నటించమని నాకు కథ చెప్పలేదు. గెస్ట్ రోల్ చేయాలి అని కథ చెప్పాడు అంతే..! ఈ సినిమా అనే కాదు నాకు ఊహలు గుసగుసలాడే కథ కూడా చెప్పాడు. అష్టాచమ్మా సినిమాతో ఇద్దరం ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేసాం. నాకు మంచి ఫ్రెండ్. ఆ ప్రెండ్ షిప్ తోనే కథ ఎలా ఉందో చెప్పమని చెప్పాడు.
అవసరాలతో మీ సినిమా ఎప్పుడు..?
కథ రెడీ కావాలి. శ్రీని ఎప్పుడు అంటే అప్పుడు నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అయితే... శ్రీని ఏదో వరుసగా సినిమాలు చేసేద్దాం అనే కంగారులో లేడు. మేమిద్దరం కలిసి చేసే సినిమా డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటున్నాం. పైగా తను ఒక లైన్ అనుకుని దానిని పూర్తి స్ధాయి కథగా మార్చడానికి టైమ్ పడుతుంది. పైగా తను ఏక్టర్ గా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అంతా సెట్ కావడానికి కాస్త టైమ్ పడుతుంది. శ్రీని నెక్ట్స్ మూవీ నాతోనే ఇది కన్ ఫర్మ్..!
నేను లోకల్ అంటూ మాస్ మూవీ చేస్తున్నారు. మాస్ ఆడియోన్స్ ని ఆకట్టుకుంటుందా..?
నేను లోకల్ మాస్ అంటే అందరూ అనుకునే మాస్ కాదు. అందరూ అనుకునే మాస్ కి తక్కువగా నాకు ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.