ఊర మాస్ లుక్‌లో నేచురల్ స్టార్ .. అంచనాలు పెంచేస్తోన్న ‘దసరా’ పోస్టర్

  • IndiaGlitz, [Sunday,March 20 2022]

ఫ్యామిలీ, లవ్, కామెడీ సినిమాలు చేస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వచ్చిన నేచురల్ స్టార్ నానీ.. ఈ మధ్య తన రూట్ మార్చాడు. ప్రయోగాత్మక కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన హీరోగా తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’ హిట్ అవ్వడంతో నాని మంచి జోష్‌లో వున్నారు. ఇదే ఊపులో మరిన్ని కొత్త సినిమాలకు నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తోన్న చిత్రం ‘దసరా’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తిసురేశ్‌ హీరోయిన్.

సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతంలోని ఒక గ్రామంలో జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకున్న దసరా సినిమా రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో ‘దసరా’ టీమ్ ... నాని ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ చేసింది. ఇందులో ఆయన ధరణి అనే రోల్‌లో గతంలో ఎన్నడూ చూడని సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘దసరా’ను తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా... సంతోషన్‌ నారాయణన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికి’’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రాజారాణి ఫేమ్ నజ్రియా నజిమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ వై నిర్మిస్తున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.