నాని హీరోయిన్ , డైరెక్టర్ కి కలిసొచ్చింది

  • IndiaGlitz, [Thursday,February 01 2018]

వ‌రుస విజ‌యాల‌తో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు యువ క‌థానాయ‌కుడు నాని. అలాంటి ఈ క‌థానాయ‌కుడి కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాల‌లో పిల్ల జ‌మీందార్ ఒక‌టి. 2011లో విడుద‌లైన ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ హ‌రిప్రియ క‌థానాయిక‌గా న‌టించ‌గా.. జి.అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌రువాత వీరిద్ద‌రు తెలుగులో సినిమాలు చేసిన‌ప్ప‌టికీ విజ‌యం ద‌క్క‌లేదు. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్‌, ఈ వ‌ర్షం సాక్షిగా చిత్రాల‌తో హ‌రిప్రియ సంద‌డి చేసినా.. ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు.

అలాగే పిల్ల జ‌మీందార్ త‌రువాత సుకుమారుడు, చిత్రాంగ‌ద చిత్రాల‌ను డైరెక్ట్ చేశారు జి.అశోక్‌. ఆ రెండు చిత్రాలు కూడా స‌క్సెస్ కాలేదు. అయితే ఈ ఏడాది ఆరంభం ఈ ఇద్ద‌రికీ క‌లిసొచ్చింది. జై సింహాలో ముగ్గురు క‌థానాయిక‌లలో ఒక‌రిగా క‌నిపించి.. సంక్రాంతికి సంద‌డి చేసిన హ‌రిప్రియకి ఆ చిత్రంతో హిట్ ద‌క్కింది. ఇక భాగ‌మ‌తి చిత్రంతో త‌న ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌ను మ‌రోసారి చాటి చెప్పిన అశోక్ కూడా మంచి హిట్ కొట్టారు. మొత్తానికి నాని హీరోయిన్‌, డైరెక్ట‌ర్‌కి ఈ జ‌న‌వ‌రి బాగానే క‌లిసొచ్చింద‌న్న‌మాట‌.