మనం సైతం సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి - నాని
Send us your feedback to audioarticles@vaarta.com
మనం సైతం సేవా కార్యక్రమాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ సేవా సంస్థ అందిస్తున్న సహాయం మనసును కదిలించిందని ఆయన అన్నారు. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం మరోసారి ఆపన్నులను ఆదుకుంది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని, పాత్రికేయులు దేవులపల్లి అమర్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, దర్శకులు వక్కంతం వంశీ, అనిల్ రావిపూడి, వివేక్, మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఘంటసాల రత్నకుమార్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గీత రోహిణి, చాందినీ శ్రీసాయి లక్ష్మి, జస్విక్, సూర్యచంద్రరావు, డీవీ శిరీష, శారద, రమేష్, ఆర్కే కుమారిలకు చెక్ లను అందజేశారు.
ఆర్థిక సహాయం అందించిన అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ....మనం దేవుడి దగ్గరకు తిరిగి వెళ్లే ముందు మనుషుల్లో దేవుడిని చూడగలగాలి. సాటి మనిషికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి దొరుకుతుంది. మనం ఆదుకున్న వాళ్ల కళ్లలో కనిపించే సంతోషాన్ని మించిన తృప్తి లేదు. వాళ్ల ఆశీస్సులను మించిన ఆశీర్వాదం లేదని నమ్ముతాను. నేను నమ్మిన ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మనం సైతం సంస్థను ప్రారంభించాను. ఈ సంస్థకు చిరంజీవి గారు మొదలు మంత్రులు తలసాని, లక్ష్మారెడ్డి ఇలా ఎందరో పెద్దల అండ లభించడం నా అదృష్టం.
గీత రచయిత రామజోగయ్య గారు లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు. ఇటీవలే ఎన్టీఆర్ గారి దగ్గరకు వెళ్లి మనం సైతం గురించి చెబితే...నేను అన్నీ చూస్తున్నాను, ప్రతీ విషయం పరిశీలిస్తున్నాను. ఒక మంచి రోజు చూసుకుని నేనే వస్తాను అని మాటిచ్చారు. అలాగే తెరాస ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చాలా సహాయం చేస్తున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. పేదవాళ్లకు వీలైనంత వేగంగా సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాను.
ఇవాళ మనం సైతం కార్యక్రమాలకు వస్తున్న స్పందన నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. పేదవాడికి అన్యాయం జరిగితే పరమశివుడిని అయినా ప్రశ్నిస్తా, పేదవాళ్లకు సహాయం చేసేది చిన్నవాళ్లైనా పాదాభివందనం చేయాలనుకుంటాను. మనం సైతంకు అండగా నిలబడేందుకు ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. చాలా బిజీలో ఉండి కూడా మా కార్యక్రమంలో పాల్గొనేందుకు నేచురల్ స్టార్ నాని వచ్చారు. ఇలా కార్యక్రమం ఉందని చెప్పగానే...నేను అక్కడ ఉన్నాను అనుకోండి అన్నారు. ఇంత మంచి మనసున్న నాని ఇంకా పెద్ద స్టార్ అవుతాడనడంలో సందేహం లేదు.అన్నారు.
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ....బయట ఏదైనా జరిగితే సినిమా పరిశ్రమ వాళ్లు ఏమీ చేయలేదు అని విమర్శిస్తుంటారు. కానీ చిత్ర పరిశ్రమలోని వాళ్లకు ఏదైనా జరిగితే ఆదుకునే వాళ్లు కూడా ఉంటారని మనం సైతం కార్యక్రమం ద్వారా కాదంబరి గారు నిరూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చి సహాయం పొందిన అందరిలో కిరణ్ గారి పట్ల ప్రేమ కనిపిస్తోంది. కుటుంబ సభ్యుడి గురించి మాట్లాడాలి అనే తపన వాళ్లలో ఉంది.
సహాయం చేయడం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు కుటుంబ సభ్యుడిగా మాట్లాడి, వాళ్ల బాధను తనది అనుకుంటూ వాళ్లకు ఆత్మస్థైర్యాన్ని అందిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే విజయాలు, పేరు ప్రఖ్యాతల కంటే సేవ ద్వారా పొందే సంతోషం గొప్పది. కాదంబరి గారు దాన్ని పొందుతున్నారు. మనం సైతం సేవా కార్యక్రమాలు చూసి నేనూ భావోద్వేగానికి గురయ్యాను. ఈ సంస్థకు ఎంత సహాయం చేస్తాను అనేది బయటకు చెప్పను గానీ...ఎప్పుడూ మీ సంస్థలో భాగంగా ఉంటానని మాటిస్తున్నాను. అన్నారు.
పాత్రికేయులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ....ఏ సంక్షేమ రాజ్యంలోనైనా విద్యా వైద్యం ప్రభుత్వాల బాధ్యత. ఈ బాధ్యత నెరవేర్చడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు కాదంబరి కిరణ్ లాంటి వాళ్ల అవసరం ఏర్పడుతుంది. ఎంత బాధలను, పేదరికాన్ని చూస్తున్నాం. ఒక్క సినిమా రంగంలోనే కాదు పాత్రికేయుల్లోనూ పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్లు ఉన్నారు. నలభై ఏళ్లుగా పాత్రికేయుడిగా ఉన్నాను. దూరదర్శన్ లో పనిచేస్తున్నప్పటి నుంచి కిరణ్ నాకు తెలుసు. మంచి స్నేహితుడు.
ఒక్క సినిమా రంగమే కాదు మొత్తం సమాజ బాగుకు కాదంబరి కిరణ్ లాంటి వాళ్లు ముందుకు రావాలి. సమాజంలో విద్యా వైద్యం సమస్యలు కాకుండా చూసే ప్రభుత్వం వచ్చినప్పుడే పేదలు బాగుపడతారు. పాత్రికేయ సంఘాల నుంచి మా వంతు సహకారం మనం సైతంకు ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు రచయిత వక్కంతం వంశీ మనం సైతం కు లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments