నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇకలేరు...
- IndiaGlitz, [Wednesday,May 01 2019]
కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో నెలరోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏప్రిల్ 3 నుంచి ఎస్పీవై రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు నంద్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ అభిమాన నేత ఇకలేడన్న వార్త విన్న అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన కార్యకర్తలు కంటతడిపెడుతున్నారు.
రెడ్డి చేసిన మంచిపనులు..!
కాగా.. నంద్యాలలో ఎస్పీవై రెడ్డి మంచి పేరున్న వ్యక్తి. ఈయన సొంత జిల్లా కడప అయినప్పటికీ నంద్యాలలో వచ్చి స్థిరపడి మంచి పేరు సంపాదించుకున్న జనాల గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి. రెడ్డి చేసిన కొన్ని మంచి పనులు ఇప్పటికీ ఎప్పటీకి జనాలు మరిచిపోయారు. ఇవాళ ఆయన ప్రజల మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన మంచి పనులు మాత్రం జనాల్లో అలాగే ఉండిపోతాయి. ముఖ్యంగా దాదాపు నంద్యాల నియోజకవర్గంలో ఉచితంగా మినరల్ వాటర్ సౌకర్యం కల్పించడం, ఒకనొక రోజుల్లో జొన్నరొట్టె, పప్పు పంచిపెట్టడం.. ఫలానా అవసరముందని ఇంటికొచ్చి అడిగితే చాలు సాయం చేసే దయాహృదయుడు. అలా మంచి పనులు చేస్తూ జనాల గుండెల్లో నిలిచిపోయారు. కాగా రెడ్డి బీజేపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి జనసేన పార్టీతో ముగించారు.