నందిని నర్సింగ్ హోమ్ మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
విజయ నిర్మల తనయుడు నరేష్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ హీరోగా పరిచయం అయిన సినిమాయే నందిని నర్సింగ్ హోం. నిజానికి నవీన్ ఐనా ఇష్టం నువ్వు అనే సినిమాతో తెరంగేట్రం చేయాల్సింది కానీ కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడటంతో నవీన్ హీరోగా చేసిన రెండో సినిమా నందిని నర్సింగ్ హోం ముందుగా విడుదలైంది. నవీన్ హీరో కాకమునుపు ఎడిటర్‌గా మంచి పేరుని సంపాదించుకున్నాడు. అలాగే 130 కిలోల బరువున్న నవీన్ హీరో కావడానికి 72 కిలోలయ్యాడు. మరి నవీన్‌కు నందిని నర్సింగ్ హోం ఎలాంటి సక్సెస్ ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథ తెలుసుకుందాం...
కథః
వైజాగ్‌లోని ఓ బ్యాంక్‌లో సేల్స్ రికవరీ మేన్‌గా పనిచేస్తుంటాడు చంద్రశేఖర్ అలియాస్ చందు(నవీన్ విజయ్‌కృష్ణ) జీవితంలో బంధాలు చాలా గొప్పవని నమ్ముతుంటాడు. తన రూం పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్ నుండి వస్తున్న అమ్మాయి గొంతు విని ఆమెతో ప్రేమలో పడతాడు చందు. చివరకు తను వినే గొంతు అమూల్య(శ్రావ్య) ది అని తెలుసుకుంటాడు. అయితే శ్రావ్యకు బంధాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. డబ్బుకే ఆమె ఎక్కువ విలువిస్తూ ఉంటుంది. తన ప్రేమను చెప్పడానికి వైజాగ్ బీచ్‌కు రమ్మని శ్రావ్యను పిలుస్తాడు చందు, కానీ అమూల్య రాదు. డబ్బు సంపాదించాలనే ఆలోచనలో హైదరాబాద్ చేరుకున్న చందు తనకు అర్హత లేకున్నా సిటీలోనే పెద్ద హాస్పిటల్ అయిన నందిని నర్సింగ్ హోంలో డాక్టరుగా చేరుతాడు. అయితే నందిని నర్సింగ్ హోం దెయ్యం తిరుగుతుందని వార్తలు వస్తాయి. అందుకు తగిన విధంగా హాస్పిటల్లో విచిత్రమైన పరిస్థితులు జరుగుతుంటాయి. అసలు ఈ పరిస్థితులకు కారణమెవరు? నందిని ఎవరు? అమూల్య ఏమైంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
ప్లస్ పాయింట్స్ః
- దర్శకత్వం
- కామెడి
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- కెమెరా
మైనస్ పాయింట్స్ః
- సినిమా అక్కడక్కడా నెమ్మదించడం
- సెకండాఫ్‌లో అసందర్భంగా వచ్చే సాంగ్
విశ్లేషణః
ముందుగా నవీన్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే హీరోగా కావాలనుకుని తనెంత కష్టం పడ్డాడో సినిమా చూస్తే తెలుస్తుంది. తొలి సినిమాయే అయినా చక్కటి నటనను ప్రదర్శించాడు. ఎక్కడా ఎక్కువ హీరోయిజాన్ని కోరుకోకుండా కథకు తగిన విధంగా పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్స్ నిత్యానరేష్, శ్రావ్యలు నటన పరంగా మంచి మార్కులే కొట్టేసినా, గ్లామర్ పరంగా సినిమాకు ఎసెట్ కాలేదు. కోమా పెషెంట్‌గా వెన్నెలకిషోర్, కాంపౌండర్‌గా షకలక శంకర్, హాస్పిటల్లో దొంగగా సప్తగిరి కామెడి ప్రేక్షకులను అలరిస్తుంది. అచ్చు సంగీతం బావుంది. నిన్నే నిన్నే సాంగ్ బావుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ మినహా ఎడిటింగ్ పరావాలేదు.దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాలో అక్కడక్కడా లాజిక్ లేని సన్నివేశాలున్నాయి. అయితే సినిమాటిక్ గా ఉండటం బాగా కలిసి వచ్చింది. ఇక దర్శకుడు పి.వి.గిరి కథను చక్కగా రాసుకున్నాడు. సినిమాలో ఒకవైపు లవ్ యాంగిల్‌ను మరోవైపు సస్పెన్స్ ఎలిమెంట్స్‌ను చక్కగా హ్యండిల్ చేశాడు. అలాగే సెకండాఫ్‌లో ఎమోషనల్ సీన్స్ కూడా బావున్నాయి.
బోటమ్ లైన్ః
నందిని నర్సింగ్ హోం.. నవ్విస్తూనే, ఉత్కంఠతను రేపే ప్రేమకథ
రేటింగ్ః 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com