Nandamuri Tarakaratna:తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి కీలక పదవి, బాలయ్య చొరవ.. చంద్రబాబుకి సిఫారసు..?
- IndiaGlitz, [Saturday,February 25 2023]
నందమూరి తారకరత్న అకాల మరణం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ, నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఆయన మన మధ్య లేడంటే ఇంకా ఎవరూ నమ్మలేకపోతున్నారు. ముఖ్యంగా తారకరత్న భార్యాబిడ్డలను చూసి పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. బయటివారికే ఇలా వుంటే.. తారకరత్న భార్య అలేఖ్య పరిస్ధితి ఏంటి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, ముగ్గురు బిడ్డలతో ఆమె అనాథగా మారింది. తారకరత్న చినకర్మ నాడు కూడా అలేఖ్య రోదిస్తూనే వున్నారు. ప్రేమ పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసినా .. అన్నీతానై కంటికి రెప్పలా చూసుకున్న భర్త ఇకలేడనే నిజాన్ని ఇంకా ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు.
అలేఖ్య రెడ్డిని దగ్గరకి తీస్తోన్న నందమూరి ఫ్యామిలీ:
అయితే ఇన్నాళ్లు తారకరత్న కుటుంబాన్ని దూరంగా వుంచిన నందమూరి కుటుంబం.. ఇప్పుడు అలేఖ్య రెడ్డికి అన్ని విషయాల్లో అండగా నిలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య తొలి నుంచి ఆమెకు భరోసాను కల్పిస్తున్నారు. తొలుత నందమూరి తారకరత్న ఆసుపత్రిలో వున్నన్ని రోజులు .. ఆయనకు మెరుగైన చికిత్స అందించడంలోనూ, కుటుంబంతో సమన్వయం చేసుకోవడంలోనూ బాలయ్య అన్నీ తానై వ్యవహరించారు. ఇప్పుడు తారకరత్న పిల్లల చదువు, పోషణ భారం తీసుకోవడానికి ఆయన ముందుకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
తెలుగు మహిళ విభాగంలో అలేఖ్య రెడ్డికి కీలక పదవి :
ఇదిలావుండగా.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని నందమూరి కుటుంబం భావిస్తోంది. ఏదో ఒక పనిలో పడితే అలేఖ్య మునుపటిలా మారుతుందని బాలయ్య భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారట. తారకరత్న టీడీపీ తరపున ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. నారా లోకేష్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. కానీ తన కోరిక తీరకుండానే తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. అయితే తారకరత్నకి దక్కాల్సిన అవకాశం అలేఖ్య రెడ్డికి కల్పించాలని బాలయ్య భావిస్తున్నారు. టీడీపీ మహిళా విభాగంలో కీలక పదవిని ఇప్పించాలని బాలయ్య యోచిస్తున్నారు. ఇందుకోసం బావ చంద్రబాబుతో బాలకృష్ణ చర్చించే అవకాశం వుంది. అయితే ఇది గాలివార్తా.. లేక నిజంగానే బాలయ్య తన వంతు ప్రయత్నాలు ప్రారంభించారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.