Alekhya Reddy:తండ్రిలా తోడు, తల్లిలా లాలన.. ఆయనే మా కుటుంబం : బాలయ్యపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
- IndiaGlitz, [Tuesday,March 14 2023]
సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నాయి. మరోవైపు ఆయన సతీమణి అలేఖ్యారెడ్డి , పిల్లలు ఇప్పుడు దిక్కులేనివారు అయ్యారు. వీరిది ప్రేమ వివాహం కావడంతో తొలినాళ్లలో ఇరు కుటుంబాలు దగ్గరకు రానివ్వలేదు. ఇప్పుడిప్పుడే రాకపోకలు ప్రారంభమయ్యాయి. అలాంటి సమయంలో తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.
భర్త జ్ఞాపకాలతో అలేఖ్యా రెడ్డి:
ఇక అలేఖ్యా రెడ్డి భర్త మరణంతో బాగా కృంగిపోయారు. కష్ట సుఖాల్లో తోడుగా వున్న ఆయన లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఫిలింనగర్ టాక్. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తారకరత్నను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనతో వున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. అంతా బాగానే వుంది కానీ.. అలేఖ్యా రెడ్డి తన పోస్టులతో నందమూరి కుటుంబాన్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. బాలయ్య తప్పించి.. కష్టాల్లో తమకు ఎవ్వరూ అండగా నిలబడలేదని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అలేఖ్య పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలయ్య ఎవ్వరూ లేనప్పుడు ఏడ్చేవారు :
అందులో ఆమె ఏమన్నారంటే.. ’’మంచి చెడుల్లో అండగా, కొండలా చివరి వరకు తమ వెంట నిల్చుంది ఒక్కరే. మాకంటూ కుటుంబం అని పిలిచేది ఆయననే.. ఓ తండ్రిలా తారకరత్నను ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా, ఆయనను కంటికి రెప్పలా కాచుకున్నారు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు .. ఒంటరిగా కుమిలిపోయేవారు. నువ్వు మాతో ఇంకొన్నాళ్లు వుండాల్సింది ఓబు’’ అంటూ అలేఖ్యారెడ్డి పోస్ట్ చేశారు. అంతేకాదు.. బాలకృష్ణతో తన పిల్లలు, తారకరత్న ఫోటోలను కలిపి ఎడిట్ చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. చివరిలో #nbk #jaibalayya #balayya #tarakrathna అనే హ్యాష్‌టాగ్స్ ఇచ్చారు.
సినీ, రాజకీయ వర్గాల్లో ఆ కార్డ్ హాట్ టాపిక్:
అంటే తారకరత్న మరణించినా ఇంకా నందమూరి కుటుంబం అప్యాయతకు తాము నోచుకోవడం లేదని అలేఖ్యారెడ్డి ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారా. లేదంటే ఇన్నాళ్లుగా గుండెల్లో దాచుకున్న బాధను వ్యక్త పరిచారా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలావుండగా.. తారకరత్న దశదిన కర్మ సందర్భంగా వేసిన కార్డ్‌లోనూ శ్రేయోభిలాషులుగా నందమూరి బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్లను ప్రత్యేకంగా ముద్రించారు. తారకరత్న తల్లిదండ్రుల పేర్లను గానీ, ఇతర నందమూరి కుటుంబ సభ్యుల పేర్లను గానీ ప్రస్తావించలేదు. తారకరత్న భార్యాపిల్లల పేర్లు, అలేఖ్య రెడ్డి తరపు వారి పేర్లను మాత్రమే ముద్రించారు. ఈ కార్డ్ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.