Taraka Ratna : తారకరత్న బ్రెయిన్‌కు పరీక్షలు.. ప్రజంట్ హెల్త్ కండీషన్ ఏంటంటే..?
- IndiaGlitz, [Thursday,February 16 2023]
గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఇంకా ఆసుపత్రిలోనే వున్నారు. దాదాపు 20 రోజులు కావొస్తున్నా ఆయన ఇంకా కోలుకోకపోవడంతో నందమూరి కటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళనలో వున్నారు. కాకపోతే.. తొలినాళ్లతో పోలిస్తే తారకరత్న పరిస్థితి కొంచెం మెరుగ్గా వుందని ఆయనను పరామర్శించిన వారు మీడియాతో చెబుతున్నారు. వైద్యులు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. కాగా గురువారం తారకరత్న మెదడు, తల భాగానికి వైద్యులు పరీక్షలు నిర్వహించినట్లుగా సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం తారకరత్న గుండె, కాలేయం, మూత్రపిండాలు సాధారణ స్థితికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కార్డియాక్ అరెస్ట్ కారణంగా తారకరత్న మెదడుకు రక్త ప్రసరణ జరగకపోవడంతో మెదడు వాపుకు గురైంది. ఈ నేపథ్యంలో మెదడు పనితీరును తెలుసుకునేందుకు ఈరోజు పరీక్షలు నిర్వహించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్ధితి, చికిత్సకు సంబంధించి ఈరోజు లేదా రేపు నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం వుంది.
గుండె, నాడీ సమస్యలకు ఫారిన్ వైద్యుల చికిత్స :
టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలని ఆకాంక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే తారకరత్నను మెరుగైన చికిత్స నిమిత్తం విదేశాలకు తరలించే అవకాశం వుందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై నందమూరి కుటుంబం గానీ, నారాయణ హృదయాలయ కానీ స్పందించలేదు. అయితే తారకరత్నకు విదేశీ వైద్యుల ద్వారా అత్యాధునిక చికిత్స అందుతోందట. ఈ విషయాన్ని నందమూరి రామకృష్ణ ఆదివారం తెలిపారు. గుండె సంబంధిత సమస్యను క్లియర్ చేస్తూనే.. నాడీ సమస్యలకు వారు చికిత్స చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.