Taraka Ratna: నందమూరి కుటుంబంలో మరో విషాదం.. తారకరత్న అస్తమయం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం

  • IndiaGlitz, [Saturday,February 18 2023]

నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీనటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.

ఇదీ తారకరత్న ప్రస్థానం :

దివంగత మహానటుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ తనయుడైన తారకరత్న ఫిబ్రవరి 22, 1983న జన్మించారు. నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు తారకరత్న. అంతేకాదు.. ఆయన ఎంట్రీ ఆషామాషీగా జరగలేదు. ఇండస్ట్రీకి ఏ హీరో అయినా సరే ఒక్క సినిమాతో ఎంట్రీ ఇస్తారు. కానీ తారకరత్న మాత్రం ఒకేసారి తొమ్మిది సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. 2002లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. దానితో పాటు మరో ఎనిమిది సినిమాలను ఒకేరోజు మొదలుపెట్టారు. ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. కొన్ని సినిమాలు మాత్రం ముహూర్తంతోనే ఆగిపోయాయి. కేవలం ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో తారకరత్న త్వరగానే ఫేడవుట్ అయిపోయారు. ఈయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ముందుకు రాలేదు. ఈ దశలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతిలో తారకరత్న విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా నంది అవార్డ్‌ను సైతం అందుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం సారథి. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘9 అవర్స్ ’ అనే వెబ్‌ సిరీస్‌లో సీఐ ప్రతాప్ పాద్ర ద్వారా ఓటీటీ ప్రేక్షకులను తారకరత్న అలరించారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న తారకరత్న:

సినిమాలు తనకు అచ్చి రాకపోవడంతో తారకరత్న రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావించారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో తారకరత్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తారకరత్న పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల నారా లోకేష్‌తో ఆయన భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ ప్రస్తుత రాజకీయాలతో పాటు కుటుంబ విషయాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి లోకేశ్ నుంచి తారకరత్న హామీ తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఎక్కడ నుంచి పోటీ చేయాలా అన్న దానిపైనా లోకేష్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. కానీ పోటీ చేయాలన్న కోరిక నెరవేరకుండానే తారకరత్న తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

More News

Venky Atluri:మనసున్న ప్రతి మనిషికి నచ్చే సినిమా 'సార్' - దర్శకుడు వెంకీ అట్లూరి

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం 'సార్'(తెలుగు)/‌ 'వాతి'(తమిళం).

Taraka Ratna:అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం, బెంగళూరుకు బాలయ్య.. కాసేపట్లో హెల్త్ బులెటిన్

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతోన్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం

Project K : పెద్ద చేయి, గన్స్‌ పట్టుకున్న వ్యక్తులు.. ప్రభాస్ ‘‘ప్రాజెక్ట్‌ కే ’’ కొత్త పోస్టర్ వైరల్, రిలీజ్ ఎప్పుడంటే..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అర్జెంట్‌గా ఓ హిట్టు కావాలి. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు పరిశ్రమను తీవ్రంగా నిరాశపరిచాయి.

IPL 2023 : మార్చి 31 నుంచి ఐపీఎల్.. తొలి మ్యాచ్‌లో‌ తలపడనున్న చెన్నై-గుజరాత్, షెడ్యూల్ ఇదే

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2023 సంబంధించి బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది.

VK Naresh:మమ్మల్ని అల్లరి చేస్తున్నారు.. సోషల్ మీడియాలో పోస్టులు, ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్‌కు నరేష్ ఫిర్యాదు

సీనియర్ హీరో నరేష్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. పవిత్రా లోకేష్‌పై తన బంధానికి సంబంధించి కొందరు హద్దులు మీరి ట్రోలింగ్