Taraka Ratna: నందమూరి కుటుంబంలో మరో విషాదం.. తారకరత్న అస్తమయం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాటం
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీనటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. తారకరత్నను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న మరణంతో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో ఇటీవల యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
ఇదీ తారకరత్న ప్రస్థానం :
దివంగత మహానటుడు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహన కృష్ణ తనయుడైన తారకరత్న ఫిబ్రవరి 22, 1983న జన్మించారు. నందమూరి కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు తారకరత్న. అంతేకాదు.. ఆయన ఎంట్రీ ఆషామాషీగా జరగలేదు. ఇండస్ట్రీకి ఏ హీరో అయినా సరే ఒక్క సినిమాతో ఎంట్రీ ఇస్తారు. కానీ తారకరత్న మాత్రం ఒకేసారి తొమ్మిది సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించారు. 2002లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తారకరత్న.. దానితో పాటు మరో ఎనిమిది సినిమాలను ఒకేరోజు మొదలుపెట్టారు. ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదు. కొన్ని సినిమాలు మాత్రం ముహూర్తంతోనే ఆగిపోయాయి. కేవలం ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో తారకరత్న త్వరగానే ఫేడవుట్ అయిపోయారు. ఈయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ముందుకు రాలేదు. ఈ దశలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతిలో తారకరత్న విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు.. ఆ సినిమాకు గాను ఉత్తమ విలన్‌గా నంది అవార్డ్‌ను సైతం అందుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం సారథి. అలాగే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘9 అవర్స్ ’ అనే వెబ్ సిరీస్‌లో సీఐ ప్రతాప్ పాద్ర ద్వారా ఓటీటీ ప్రేక్షకులను తారకరత్న అలరించారు.
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న తారకరత్న:
సినిమాలు తనకు అచ్చి రాకపోవడంతో తారకరత్న రాజకీయాల్లో అడుగుపెట్టాలని భావించారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో తారకరత్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తారకరత్న పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఇటీవల నారా లోకేష్‌తో ఆయన భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ ప్రస్తుత రాజకీయాలతో పాటు కుటుంబ విషయాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి లోకేశ్ నుంచి తారకరత్న హామీ తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ఎక్కడ నుంచి పోటీ చేయాలా అన్న దానిపైనా లోకేష్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది. కానీ పోటీ చేయాలన్న కోరిక నెరవేరకుండానే తారకరత్న తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout