Taraka Ratna: రోజులు గడుస్తున్నా స్పృహలోకి రాని తారకరత్న.. విదేశాలకు తరలించే ఛాన్స్..?
- IndiaGlitz, [Saturday,February 04 2023]
గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వున్నప్పటికీ.. ఆయన ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్నారు. కాకపోతే.. తొలినాళ్లతో పోలిస్తే తారకరత్న పరిస్థితి కొంచెం మెరుగ్గా వుందని ఆయనను పరామర్శించిన వారు మీడియాతో చెబుతున్నారు. వైద్యులు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న కోలుకుని తిరిగి మామూలు మనిషి కావాలని ఆకాంక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక పూజలు సైతం నిర్వహిస్తున్నారు.
తారకరత్నను కంటికి రెప్పలా కాపాడుతోన్న బాలయ్య :
అయితే రోజులు గడుస్తున్నా తారకరత్న ఇంకా స్పృహలోకి రాకపోవడంతో అంతా ఆందోళనలో వున్నారు. అటు నందమూరి బాలకృష్ణ ఆసుపత్రి వద్దే వుండి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వైద్యులు, కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం చేసుకుంటూ తారకరత్నను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఇదిలావుండగా తారకరత్న ఆరోగ్యం గురించి మీడియా, సోషల్ మీడియాలలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వదంతులు నమ్మొద్దని డాక్టర్లు, నందమూరి కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఎయిర్‌లిఫ్ట్ ద్వారా విదేశాలకు తారకరత్న:
తాజాగా తారకరత్నకు మరింత మెరుగైన చికిత్స అందించాలని నందమూరి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. అవసరం అయితే తారకరత్న విదేశాలకు తీసుకెళ్లే అవకాశం వుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఎయిర్ లిఫ్ట్ ద్వారా విదేశాలకు తీసుకువెళ్తారని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం వుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:
కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.