Nandamuri Ramakrishna:నందమూరి కుటుంబానికి తప్పిన పెను విషాదం.. తృటిలో బయటపడ్డ రామకృష్ణ
- IndiaGlitz, [Saturday,February 11 2023]
నందమూరి కుటుంబానికి టైం బాగోనట్లుగా వుంది. ఇప్పటికే జానకీరామ్, హరికృష్ణ, కంఠమనేని ఉమామహేశ్వరి మరణాలతో విషాదంలో వున్న ఆ కుటుంబాన్ని తాజాగా తారకరత్న అనారోగ్యం కలవరపాటుకు గురిచేస్తోంది. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆయన కోలుకోలేదు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే వుంది. ఈ నేపథ్యంలో ఆయనను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా మెరుగైన చికిత్స నిమిత్తం విదేశాలకు తరలిస్తారంటూ వార్తలు వస్తున్నాయి.
నందమూరి రామకృష్ణకు తప్పిన ముప్పు:
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో నందమూరి కుటుంబానికి తృటిలో పెను విషాదం తప్పినట్లయ్యింది. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణకు ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ఘటనలో రామకృష్ణకు ఎలాంటి గాయాలు కాలేదు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 మీదుగా వెళ్తుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రామకృష్ణే కారును స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. ఆ వెంటనే రామకృష్ణ కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. రామకృష్ణకు ఏం జరగకపోవడంతో నందమూరి అభిమానులు , కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. గతంలో నందమూరి హరికృష్ణ ఆయన కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదాల్లోనే దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.
నందమూరి జానకీరామ్ :
2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకీరామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ట్రాక్టర్‌ను తప్పించబోయి జానకీరామ్ కారు బోల్తాపడింది. దీంతో స్థానికులు ఆయనను హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి వద్దకు తరలించారు. అయితే జానకీరామ్ అప్పటికే కన్నుమూసినట్లు వైద్యలు ధ్రువీకరించారు.
నందమూరి హరికృష్ణ :
జానకీరామ్ ఆకస్మిక మరణం నుంచి కోలుకుంటున్న నందమూరి కుటుంబానికి 2019లో మరో షాక్ తగిలింది. ఆ ఏడాది ఆగస్ట్ 29న హైదరాబాద్ నుంచి నెల్లూరులోని ఓ కార్యక్రమానికి వెళ్తుండగా నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో హరికృష్ణ ప్రయాణిస్తోన్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. కారుపై నియంత్రణ కోల్పోవడంతో అది ఎగిరి రోడ్డుకు అవతలి వైపు పడింది. ప్రమాద తీవ్రతకు హరికృష్ణ వాహనం నుంచి బయటకు పడిపోవడంతో ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆయనను హుటాహుటిన నార్కెట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హరికృష్ణ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో నందమూరి కుటుంబం, అభిమానులు, తెలుగు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.