Taraka Ratna : ఎక్మో అసలు పెట్టలేదు.. తారకరత్న సొంతంగానే శ్వాస పీల్చుకుంటున్నారు : నందమూరి రామకృష్ణ
- IndiaGlitz, [Monday,January 30 2023]
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు తెలిపారు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ. వెంటిలేటర్‌పై వున్నప్పటికీ.. తనంతట తానుగా శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని రామకృష్ణ పేర్కొన్నారు. ఇదే సమయంలో న్యూరో అనేది రాత్రికి రాత్రే రికవరీ అయ్యేది కాదన్న ఆయన.. దానికి కాస్త సమయం పడుతుందని చెప్పారు. తారకరత్నకు ఎక్మో పెట్టినట్లుగా వస్తున్న వార్తలను రామకృష్ణ కొట్టిపారేశారు. ప్రస్తుతం తారకరత్న అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయని ఆయన తెలిపారు. కార్డియాలజిస్టులతో పాటు న్యూరాలజిస్టులు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని రామకృష్ణ వెల్లడించారు. త్వరలోనే తారకరత్న కోలుకుని మామూలు మనిషిగా తిరిగి వస్తారని ఆయన చెప్పారు.
తారకరత్న ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్న పది మంది వైద్యులు :
మరోవైపు ఆసుపత్రి వద్దకు నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ అభిమానులు, సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై సమీక్షిస్తున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు శరీర భాగాలకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై ప్రభావం పడిందని ఆయన మీడియాకు వివరించారు. ప్రముఖ న్యూరోసర్జన్ గిరీష్ కులకర్ణి ఆధ్వర్యంలో ఇద్దరు వైద్యులతో పాటు నారాయణ హృదయాలకు చెందిన మొత్తం పది మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు.
నిన్న తారకరత్నను పరామర్శించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్:
ఇకపోతే.. నిన్న ప్రత్యేక విమానంలో తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు బెంగళూరుకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్ధితిని ఆరా తీశారు. అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న పోరాడుతున్నారని, అయితే చికిత్సకు స్పందించడం ఊరటనిచ్చే అంశమన్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని.. క్రిటికల్ కండీషన్ నుంచి బయటపడ్డారని చెప్పలేం, కానీ తారకరత్న త్వరలోనే కోలుకుంటారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుత అన్నయ్య ఎక్మోపై లేరని ఆయన స్పష్టం చేశారు. తాతగారి ఆశీస్సులతో పాటు అభిమానుల ఆశీర్వాదంతో ఆయన కోలుకుని మునుపటిలాగే మనందదరితో ఆనందంగా వుండాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఇలాంటి పరిస్ధితిలో తమ కుటుంబానికి అండగా నిలిచిన కర్ణాటక ప్రభుత్వానికి, తమకు అత్యంత ఆప్తుడైన కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్‌కు జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు.