Balakrishna:తారకరత్న పేరు చరిత్రలో నిలిచిపోయేలా.. పెద్ద మనసు చాటుకున్న బాలయ్య
- IndiaGlitz, [Tuesday,March 21 2023]
సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నాయి. ఇక తారకరత్న అంటే బాలయ్యకు ఎంతో ప్రేమ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను హీరోగా పరిచయం చేసిన నాటి నుంచి నేటి వరకు అన్నింట్లోనూ తారకరత్నకు బాలయ్య అండగా నిలిచారు.
ఆసుపత్రిలో తారకరత్న వెంటే వున్న బాలయ్య :
ఇక కుప్పంలో పాదయాత్ర సందర్భంగా గుండెపోటుతో తారకరత్న కుప్పకూలితే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయకు తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలోనూ వుంటూ కుటుంబానికి, వైద్యులకు మధ్య వారధిలా నిలిచారు. ఇక తారకరత్న చనిపోయిన నాటి నుంచి అతని భార్యాబిడ్డల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి ఎన్నో సార్లు బాలయ్యను తలచుకుని ఎమోషనలైంది. తమకు కుటుంబం అంటూ ఒకటుందంటే అది బాలయ్యే.. కష్ట సుఖాల్లో ఎన్నోసార్లు అండగా నిలిచారని ఆయనపై అభిమానాన్ని చాటుకుంది అలేఖ్య.
తమకు కలిగిన కష్టం ఏ కుటుంబానికి రాకూడదని :
ఈ నేపథ్యంలో తాను ఎంతో ఇష్టపడే తారకరత్న పేరు చరిత్రలో నిలిచే విధంగా నిర్ణయం తీసుకున్నారు బాలయ్య. తారకరత్నకు కలిగిన కష్టం ఏ కుటుంబానికి కలగకూడదనే ఉద్దేశంతో నిరుపేదలు గుండెజబ్బులకు గురైతే వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. అది కూడా తారకరత్న పేరు మీద. హిందూపురంలో బాలయ్య నిర్మించని హాస్పిటల్లకు తారకరత్న పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పేదలకు అత్యాధునిక వైద్యం అందించేందుకు గాను రూ.1.30 కోట్లతో వైద్య పరికరాలను ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. అలాగే ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు ఉచితంగా భోజనం, మందులు కూడా అందించే ఏర్పాట్లు చేశారట బాలయ్య. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలయ్య దేవుడంటూ నందమూరి అభిమానులు పోస్టులు పెడుతున్నారు.