Balakrishna:మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసారి నర్సులను కెలికిన నటసింహం, భగ్గుమన్న నర్సుల సంఘం
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నామథ్య దేవాంగ కులస్తుల ఆగ్రహానికి గురైన ఆయన.. ఆ వెంటనే వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో మహానటుడు ఎస్వీ రంగారావు, అక్కినేని నాగేశ్వరరావులపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఈ వివాదం సద్దుమణగక ముందే మరోసారి నోరుజారారు బాలయ్య. నర్సులపై ఆయన చేసిన వ్యాఖ్యలతో నర్సుల సంఘం భగ్గుమంటోంది. తక్షణం బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే:
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ 2’ విజయవంతంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మొత్తంలోనే ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓ ఎపిసోడ్ వుంది. అదే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్. ఈ కార్యక్రమంలో పవన్‌కు సంబంధించిన అనేక అంశాలపై బాలయ్య ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో యువహీరో సాయిథరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా బాలయ్య కూడా గతంలో తనకు జరిగిన ప్రమాదాన్ని వివరించారు. కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో తాను కూడా బైక్‌లపై ఎక్కువగా తిరిగేవాడినని.. ఓరోజు రోడ్డు క్రాస్ చేస్తుండగా మరో బైక్ ఢీకొట్టిందని బాలయ్య తెలిపారు. ప్రమాదంలో తనకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు. అయితే డాక్టర్లకు రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా కాకుండా.. కాలుజారి కిందపడినట్లుగా చెప్పాలని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారని బాలయ్య పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తనకు చికిత్స అందించడానికి వచ్చిన ఒక నర్సును ఉద్దేశించి.. ‘‘దానెమ్మ.. ఆ నర్సు భలే అందంగా వుంది. ఫేస్ క్లీన్ చేస్తూ ఏమైంది అని ప్రశ్నించిందని, దానికి తానేమో యాక్సిడెంట్ జరిగినట్లు చెప్పానని, దీంతో వాళ్లు గెట్ అవుట్ అనేశారు’’ అంటూ బాలయ్య తెలిపారు.
బాలయ్య వ్యాఖ్యలపై భగ్గుమన్న ఏపీ నర్సింగ్ సంక్షేమ సంఘం:
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ మాటలను తీవ్రంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాలయ్య నర్సులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా వున్నాయన్నారు. అంతేకాదు.. ప్రమాదంలో గాయపడి తనకు వైద్యం చేయడానికి వచ్చిన నర్సు గురించి గౌరవప్రదంగా మాట్లాడాల్సిందిపోయి.. ఆమె అందం గురించి అసభ్యంగా మాట్లాడటం సరికాదని ప్రసాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలను బాలయ్య తక్షణం వెనక్కి తీసుకోవాలని.. నర్సులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా వుంటాయని నర్సింగ్ అసోసియేషన్ హెచ్చరించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments