NTR Health University : శునకాలముందు తలదించుతారా.. సిగ్గులేని బతుకులు : ఎన్టీఆర్ పేరు మార్పుపై బాలయ్య
- IndiaGlitz, [Saturday,September 24 2022]
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం సహా పలువురు నేతలు పార్టీలకతీతంగా జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ వారు మండిపడుతున్నారు. అటు ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు సైతం ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.. తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు సహా మూడు పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు వైసీపీలోనూ జగన్ నిర్ణయంపై చర్చ మొదలైంది. కానీ ఎవ్వరూ మాట్లాడలేని పరిస్ధితి. కానీ తెలుగుదేశం నుంచి వైసీపీ మద్ధతుదారుడిగా మారిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరారు.
బాలయ్య టార్గెట్ చేసింది ఎవరిని :
ఈ క్రమంలో ఎన్టీఆర్ తనయుడు, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాత్రం సీరియస్‌గా స్పందించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఏముందంటే.. ‘‘ మార్చేయడానికి .. తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నెముక ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు.. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు…… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’’ అంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ఎవరిని టార్గెట్ చేసి ఈ మాటలు అన్నారో బహిరంగ రహస్యమే. అవి ఎవరికి తగలాలో వారికి ఈపాటికే తగిలాయ్.
అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు :
ఇకపోతే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలసిందే. నిన్న ఉదయం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి చేసిన సేవలు, చేపట్టిన సంస్కరణల కారణంగానే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రజనీ తెలిపారు. ఆపై సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ఎన్టీఆర్ అంటే తమకు కూడా గౌరవం వుందన్నారు. చంద్రబాబు కంటే ఎన్టీఆర్‌పై తనకే గౌరవం ఎక్కువని, అడక్కపోయినా ఎన్టీఆర్ పేరిట జిల్లాను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.