మంత్రి హరీశ్‌రావును కలిసిన బాలకృష్ణ.. క్యాన్సర్ హాస్పిటల్‌కు సాయంపై వినతి
- IndiaGlitz, [Tuesday,January 11 2022]
సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుని కలిశారు. మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన బాలయ్య.. తాను చైర్మన్‌గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సేవలను గురించి వివరించారు. ఆస్పత్రికి అందిస్తున్న వైద్య సేవలు, అత్యాధునిక సౌకర్యాలు తదితర విషయాలపై మంత్రికి తెలిపారు బాలయ్య.
అలాగే ఆస్పత్రి అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను కూడా మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి క్యాన్సర్ ఆస్పత్రి , రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి సహాయ సహకారాలు అందించాలని బాలకృష్ణ కోరారు. ఆయన విజ్ఞప్తికి మంత్రి హరీశ్ రావు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని బాలకృష్ణకు చెప్పినట్లు సమాచారం. మంత్రి హరీశ్ రావును కలిసిన వారిలో ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు, ప్రతినిధులు ఉన్నారు.
కాగా.. సినిమాలు, రాజకీయాలు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా వుండే బాలయ్య.. గతేడాది కొత్త అవతారం ఎత్తారు. తెలుగు ఓటీటీ ‘‘ఆహా’’లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే పేరిట టాక్ షో చేస్తున్నారు. ఈ షోకు మంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే బాలయ్య తొలిసారి యాంకర్‌గా మారి తోటి తారలను ఇంటర్వ్యూ చేసే విధానం ప్రజలను ఆకట్టుకుంటోంది. తొలి సీజన్‌లో భాగంగా మొత్తం 10 ఎపిసోడ్‌లు ముగిశాయి. ఇదిలా ఉంటే బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్‌షో అరుదైన ఘనతను సాధించింది. IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ షోల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఒక తెలుగు టాక్ షోకి ఇలాంటి గౌరవం లభించడం ఇదే తొలిసారి.