కారంచేడులో సంక్రాంతి వేడుకలు.. అక్క పురంధేశ్వరి ఇంటికి బాలయ్య ఫ్యామిలీ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని అన్నారు. చెమటోడ్చి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ.. రైతులు, రైతుకూలీలు, గ్రామీణులు, మహిళలు, యువత, అందరిలో ఆనందం నింపే పండుగ సంక్రాంతి అని బాలయ్య అన్నారు.
క్రాంతి అంటే మార్పు.. సంక్రాంతి అంటే మంచిమార్పు అని ఆయన వ్యాఖ్యానించారు. భోగిమంటలు వేయడం, రంగవల్లులతో సంక్రాంతిని స్వాగతించడం, గ్రామీణ క్రీడలతో సంబురాలు జరుపుకోవడం, పెద్దలను స్మరించుకోవడం, రైతు నేస్తాలైన పశువులను పూజించడం అనాదిగా వస్తున్న మన సంప్రదాయమని బాలయ్య గుర్తుచేశారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలని, ఇంటింటా ఆనందాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సారి బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా సంక్రాంతి నేపథ్యంలో గురువారమే కారంచేడుకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సాధారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారి పల్లెలో జరిగే సంక్రాంతి వేడుకల్లో బాలయ్య కుటుంబం పాల్గొనేది. అయితే ఈసారి మాత్రం బాలకృష్ణ కారంచేడులో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments