Nandamuri Balakrishna : కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన బాలయ్య దంపతులు.. శ్యామలాదేవికి ఓదార్పు

  • IndiaGlitz, [Monday,October 10 2022]

అనారోగ్యంతో మరణించిన దిగ్గజ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పరామర్శించారు. సోమవారం భార్య వసుంధరా దేవితో కలిసి కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బాలయ్య.. రెబల్ స్టార్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో మాట్లాడి ఆమెను ఓదార్చారు.

కృష్ణంరాజును చూస్తూ పెరిగా :

ఎన్నో ఏళ్లుగా కృష్ణంరాజుతో తనకు అనుబంధం వుందని బాలయ్య చెప్పారు. నాన్నగారి హయాం నుంచి కృష్ణంరాజుని చూస్తూ పెరిగానని, ఆయన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారని బాలకృష్ణ ప్రశంసించారు. అలాంటి అద్బుతమైన నటుడితో కలిసి నటించే అవకాశం తనకు కూడా దక్కిందని.. సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలలో కలిసి నటించామని బాలయ్య గుర్తుచేసుకున్నారు. కృష్ణంరాజు లేని లోటును ఎవరూ పూడ్చలేరని అన్నారు.

కృష్ణంరాజు చివరిచూపుకు నోచుకోలేకపోయిన బాలయ్య :

ఇంతటి అనుబంధం వున్న కృష్ణంరాజు చనిపోయినప్పుడు ఆయనను చివరి చూపు చూసేందుకు బాలయ్య నోచుకోలేకపోయారు. దీనికి కారణం ఆయన ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం టర్కీలో వుండటమే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న తన 107వ చిత్రం షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ టర్కీ వెళ్లారు. అందుకే కృష్ణంరాజు చనిపోయినప్పుడు ఆయనకు బాలయ్య నివాళులర్పించలేకపోయారు. ఇటీవలే టర్కీ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన బాలకృష్ణ తాజాగా కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు.

మహేశ్, కృష్ణలను పరామర్శించిన బాలకృష్ణ :

అలాగే సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవికి కూడా బాలయ్య నివాళులర్పించిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన ఇందిరా దేవి దశ దిన కర్మ కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేశ్ బాబులను ఆయన పరామర్శించి ఓదార్చారు. ప్రస్తుతం బాలయ్య , మహేశ్ బాబు కలిసున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బాలయ్య హోస్ట్‌గా ఆహాలో ప్రసారమైన అన్‌స్టాపబుల్‌ షోలో మహేశ్ బాబు పాల్గొని పలు ఆసక్తికరమైన సంగతులను పంచుకున్న సంగతి తెలిసిందే.